గోపాలం మాస్టారు
అప్పుడే పిల్లని చంకనేసుకొని వళ్ళు వెచ్చెబడిందని కళ్ళు వత్తుకుంటూ పరిగెత్తు కొచ్చిన ఓ గొల్లమ్మెని సముదాయిస్తూ, పిల్ల నాడిచూసి ఉపశమనానికి మాత్రలిచ్చి పంపి మరల కూర్చొనేసరికి, ఇంకెవరో కాలు బెణికిందని కుంటుకుంటూ వస్తే, ఏమాత్రం అసహనం లేకుండా బెణుకు మంత్రం వేసి చేయాల్సిన సపర్యలు చెప్పి, పిల్లలందరినీ పంపి, గబ గబా నాలుగు మెతుకులు తిని నడుచుకుంటూ బడికి బయలు దేరి సాయంత్రం దాకా బడి పిల్లల చదువులతో కుస్తీ పట్టి, 5 గంటలకు ఇంటికి చేరేసరికి మళ్ళీ ఇంటివద్ద పిల్లలు సిద్ధం. ఒక్కోసారి ఇంటి లోపలికి కూడా వెళ్ళకుండానే, ఆ పిల్లలతో మమేకమయి వాళ్ళచే చదివిస్తూ, సందేహాలను తీరుస్తూ వాళ్ళని ఇంటికి పంపి, తిని పడుకొనే సరికి ఏ తొమ్మిదో పదో. ఇది నిస్సందేహంగా ఒక అవధాన ప్రక్రియే.
సోమవారం నుండి శనివారం దాకా ప్రతిరోజూ ఇదే ప్రహసనం . ఆదివారం పిల్లలకు శెలవు. కానీ ఆయన మాత్రం అలుపెరుగని అధ్యాపకుడు. ఆ ఆదివారాన్నిమాత్రం తమ ఇంట్లో నడుపుతున్న ఉచిత గ్రంధాలయ పనికోసం కేటాయించేవారు . ఉదయం పదింటికల్లా భోజనం చేసి, రెండు పెద్ద ఖాకీ సంచీలలో పుస్తకాలను నింపి, రెండు భుజాలకీ చెరొకటీ తగిలించుకొని కొత్తపేట అగ్రహారంలో ఉన్న గ్రంధాలయానికి కాలి నడకని వెళ్ళి, ఆ పుస్తకాలను ఇచ్చి మరల క్రొత్త పుస్తకాలను సంచిలలో నింపి తిరిగి కాలి నడకనే ఉత్తేజకర పాదాచారిలా ఇంటికి చేరి, చెక్కబీరువాలో వాటినన్నిటినీ వరసక్రమంలో సర్దడంతో ఆ రోజంతా గడిచిపోయేది. పలివెల్లో ఉన్న పుస్తక ప్రియులకు ఆ శాఖా గ్రంధాలయమే ఒక అద్భుత "పుస్తకభాండారం" , పైగా పైసా ఖర్చు లేకుండా చందమామ, బాలమిత్ర దగ్గరనుండి యుద్ధనపూడి, కోడూరి, కొడవటిగంటి లాంటి సుప్రసిద్ధుల రచనలు చదివే సువర్ణ అవకాశం.
సాధారణంగా మనం
"తల్లోనాలుక" అనే పదం వింటూఉంటాం. ఆ పదానికి నిలువెత్తు నిదర్శనం
ఆయన. ఊళ్ళో ఎవరికి ఏ నలత వచ్చినా ప్రధమ
చికిత్స కోసం, ఇంట్లో ఏ ఆపద
వచ్చినా సలహా కోసం, పిల్లలు మాట వినక
అల్లరి చేస్తున్నా అదుపుకోసం వినిపించే ఒకే ఒక్క పేరు ఆయనదే. ఇప్పటికీ ఆయన చేసిన
"చాపముల్లు" వైద్యం ఒక ఆశ్చర్యంగా కళ్ళముందు మెదులుతూంటుంది.
ప్రతి సంవత్సరం
కోమట్ల వినాయకచవితి పందిరిలో ప్రతిష్టించబడే విఘ్నేశ్వర పార్ధివ ప్రతిమ సృష్టికర్త
ఆయనే. అంతేకాకుండా వారి స్వహస్తాలతో కార్తీకదీపం కోసం తాటాకులతో అందంగా అల్లబడిన
దీపపు గూడు , పిచ్చుకల ఆహారం
కోసం తయారు చేసిన వరికంకుల చూడముచ్చటి సమాహారం, పనసాకుల పొట్టింగ బుట్టలు, భగవన్నామ స్మరణలు,నగరసంకీర్తనలు ..ఎన్నో ఎన్నెన్నో .. మదిలో
మెదులుతూనే ఉన్నాయి.
ఆయనే మన 'నిమిషకవి గోపాలం' మాస్టారు.
పుస్తకాలలోని చదువుల సారాన్ని మస్తికాలలోకి
ప్రసరింపచేసిన ఒక అద్భుత వ్యక్తిత్వానికి అనువైన విశేషణం.
మీ వద్ద
నేర్చుకున్న ఓనమాలు సంస్కార గంగలో మునిగిన ములకలు. అనంతజీవన సాగరతీరాన
దారిచూపించిన దీపస్తంభాలు.
మీరు దిద్దించిన
అక్షరాలు మా జీవనయాత్రకి సోపానాలు, పరుచుకున్న కుసుమ
బాటలు.
ఏమి ఇవ్వగలం మీకు?
ఈ అక్షరాంజలి తప్ప!
(యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్)
No comments:
Post a Comment