Friday, February 18, 2022

నేను తప్పుచేశానంటావా?

 

నేను తప్పుచేశానంటావా?

                                                                                                   శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ

"దివా! టైం ఎనిమిదవుతోంది. లేచి స్నానం చేయాలి. ఇంకో అరగంటలో కుళాయి కట్టెస్తారుట" అన్న భార్య మాటలకి మెలుకువొచ్చింది దివాకరానికి.

అబ్బా! ఇక్కడకూడా పడుకోనీయవా అంటూ బద్ధకంగానే లేచి బాత్రూంకి దారితీశాడు.

 

అంతకుముందు రోజే అమెరికా నుండి ఇద్దరు పిల్లలను తీసుకొని రెండువారాలు ఇండియాలో గడపటానికొచ్చారు దివాకరం, నీలిమ. రాజమండ్రి పట్టణాన్ని ఆనుకొని గోదావరి ఉన్నా వేశవి కాలం కావడంతో సగానికిపైగా ఎండిపోవడంతో నీటికుళాయి సరఫరాను ప్రొద్దున్న సాయింత్రాలకు గంట చొప్పున పరిమితం చేశారు. వీలైనంతవరకు కుటుంబం మొత్తం కుళాయి వెళ్ళేలొపులో నీళ్ళకార్యక్రమాలు కానిచ్చేసి, మిగతా నీటిని రెండు పెద్ద గుండిగలతో పట్టుకొని సాయింత్రం కుళాయి కోసం వేచిచూడడమన్నది పట్టణవాసుల దినచర్యలలో ఒక ప్రధానభాగమైపోయింది.

 

దివాకరం స్నానం చేసి హాల్లో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు.

 

"టిఫిన్ తేవడానికి నాన్న హొటెల్ కి వెళ్ళారు. ఈలోపు కాఫీ తాగుతావా" అడిగింది నీలిమ.

 

" అలాగే, పిల్లలింకా లేవలేదా? రాత్రి బాగా లేటుగా పడుకున్నారనుకుంటా" అంటూ నీలిమతోబాటు కిచెన్ లోకి నడిచాడు దివాకరం.

 

"బాగా నిద్రబట్టిందా బాబూ" అని దివాకరాన్ని పలకరిస్తూ, "పాలు స్టౌ మీద పెట్టాను, ఫిల్టరులో డికాషను దిగే ఉంటుంది చూడు" అని కూతురికి పురమాయిస్తూ పెరట్లోకి దారితీసింది నీలిమ తల్లి.

 

రెండు స్టీలు గ్లాసుల్లో కాఫీ పోసి ఒకటి దివాకరానికిచ్చి, "నడు హాల్లో కూర్చొని తాగుదాం" అంది నీలిమ.

 

"ఈరొజు కార్యక్రమం ఏమిటి?" అన్నాడు మెల్లిగా కాఫీ సిప్ చేస్తూ.

 

"నువ్వేవో బట్టలు కొనాలన్నావు కదా? ఒకవేళ రెడీమేడ్ కాకపోతే, కుట్టివ్వడానికి టైం పడుతుంది" అంది నీలిమ.

 

" అవును కదా! అయితే ఈరోజే వెళదాం పద" అన్నాడు దివాకరం.

 

ఉదయం పదకొండుకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దివాకరం, నీలిమ షాపింగుకి బయలుదేరారు ఆటొలో.

 

 

కొటగుమ్మం గాంధీ బొమ్మదగ్గర ఆటో దిగి బట్టల కొట్టులు చూసుకుంటూ నడుస్తున్నారిద్దరూ. దాదాపు ఇరవై ఏళ్ళుగావస్తోంది రాజమండ్రి వదలి. ఊరు బాగా పెరిగిపొయింది. ఆటోలు మొటారు సైకిళ్ళు విపరీతమైపోయాయి. అసలే ఇరుకుసందు, ఆటోలు పోనివ్వరు కాబట్టి మోటారు సైకిల్ పై కుటుంబం మొత్తాన్ని ఎక్కించుకొని అడ్డంగా నడుస్తున్న జనాలను చాకచక్యంగా తప్పించుకొని వెళ్ళేవిధానం చూస్తుంటే ఇద్దరికీ ఆశ్చర్యంగాఉంది. ఆవీధొక చిన్న ప్రపంచం. అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. ముఖ్యంగా నల్లమందు వీధి, గుండువారి వీధి చాలా ప్రశిద్ధి. నాలుగడుగులు వేసారో లేదో ఒకటే ఉక్కబోత. ధారాళంగా చమటలు పడుతున్నాయి దివాకరానికి.

" అబ్బా!  నావల్లకాదు! ఎదోఒక షాపులోకెళదాం పద!" అని దివాకరం అనగానే, సరేఅని అతనితోపాటు ఎదురు గుండా కనిపిస్తున్న మూడంతస్తుల బట్టల షాపులోకి నడిచింది నీలిమ.

లోపలికి అడుగుపట్టగానే ఏసి చల్లదనానికి ఒక్కసారి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఒకనలుగురైదుగురు చుట్టూమూగి ఏం కొనాలనుకుంటున్నానో అడిగి మగాళ్ళ సెక్షన్ కి తీసుకుపోయారు. ప్యాంటు చొక్కాల తాన్లు షెల్ఫుల నిండానే కాకుండా నేలమీదకూడా గుట్టలుగుట్టలుగా పడిఉన్నాయి. చాలా కంఫ్యూజన్ లో పడిపోయాడు దివాకరం. ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారికూడా తనబట్టలు తను కొనుక్కోలేదు. ఎప్పుడూ భార్య కొని పట్టుకొచ్చినవి కట్టుకోవడమే. ఏం కొనాలో అర్ధం కావడంలేదు. అందరూ తననే చూస్తున్నారు. కొంత ఇబ్బందిగా అనిపించింది.

"నావల్ల కాదుగానీ, నువ్వే కానిచ్చేసేయ్" అని నీలిమకి ఒక హింటిచ్చాడు దివాకరం.

భార్య చూపించినవాటికి తలూపుతూ మొత్తానికి ఒక అరడజను జతలు తీసుకొని క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ కార్డిస్తూ "ఇక్కడెవరైనా బాగా కుట్టే టైలర్ ఉన్నడా" అని అడిగాడు.

 

ప్రక్కనే గుండువారి సందులో టైలర్ ఖాదిర్ అని ఉన్నాడండి, బాగా కుడతాడు" అని అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి.

" దివా! నేను చీరలు చూస్తూఉంటాను, నువ్వెళ్ళొచ్చేయ్" అని నీలిమ చీరల సెక్షన్ లోకి నడిచింది.

బిల్లు చెల్లించి టైలర్ షాపుకి బయలుదేరాడు దివాకరం. అడ్రసు చాలా సులువుగానే దొరికింది. పెద్ద షాపేమీ కాదు, చిన్న అరుగుమీద ఒకే ఒక్క మిషను. ఒక చిన్న కుర్రాడు, సుమారు పది సంవత్సరాలుంటాయి చొక్కాలకి బొత్తాలు కాజాలు కుడుతున్నాడు.

 

"బాబూ! ఖాదిర్ షాపిదేనా" అడిగాడు దివాకరం కుర్రాడిని.

" లేడండి నమాజుకెళ్ళాడు ఒక అర గంటలో వస్తాడు" అని కుర్రాడు చెప్పి కూర్చోవడానికి స్టూలు చూపించాడు . దివాకరానికి అనుమానం వచ్చింది అసలు సరిగ్గా కుడతాడాని. కానీ ఎండలో మరి ఇంక తిరగడానికి సాహసించకుండా స్టూలుమీద కూర్చున్నాడు. ఆకుర్రాడినే చూస్తున్నాడు. హుషారుగా ఒక చొక్కా తరువాత మరొక చొక్కాకి కుట్టుకుంటూ పోతున్నాడు. చాలా చురుగ్గా ఒక యంత్రంలో పనిచేస్తున్నాడు.

 

" బాబూ నువ్వేమవౌతావు ఖాదిర్ కి" అడిగాడు దివాకరం.

"ఖాదిర్ మానాన్నండి. నా పేరు షాజహాన్" అని బదులిచ్చాడాకుర్రాడు.

 

" ఏం చదువుతున్నావు షాజహాన్" అని అడిగాడు దివాకరం.

 

" స్కూలు మానేశానండి. అయిదు దాక చదివాను" అన్న షాజహాను మాటల్లో కొంత బాధలాంటిది ధ్వనించింది.

 

దివాకరం ఆసక్తిగా మాటలు కొనసాగించాడు. తనకిద్దరక్కలున్నారని , సుమారు మైళ్ళ దూరంలో కాలనీలో వాళ్ళిల్లుందని, వాళ్ళమ్మ ఇంటిదగ్గరే ఉన్న ఒక అపార్టుమెంటు వద్ద ఇస్త్రీ బండి నడుపుతుందని గడ గడా అచ్చ తెలుగులో చెప్పాడు. వాడి భాష చూసి ముచ్చటేసింది దివాకరానికి. టివి ఏంకర్ల తెలుగుతో అసలు తెలుగు మరచిపోతున్న ఈరోజుల్లో చక్కటి స్వరంతో గోదావరి యాసతో ఒక ముస్లీం అబ్బాయి ఒక్క అక్షరంకూడా పొల్లుబోకుండా చెప్పడంచూసి ఆశ్చర్యమేసింది.

 

ఇంతలో తెల్ల కుర్తా పైజమా, తెల్లని గడ్డం నెత్తిమీద టోపీ ఉన్న ఒక వ్యక్తి వచ్చి "నమస్తే సార్" అన్నాడు.

అతనే ఖాదిర్ అని అర్ధమైంది దివాకరానికి.

"ఇవి ఆరు జతలు, పది రోజులలో కుట్టివ్వాలి. కుదురుతుందా" అడిగాడు దివాకరం.

"అలాగే సార్" అని తలూపి టేపుతో కొలతలు తీసుకోవడం మొదలెట్టాడు ఖాదిర్. తండ్రి టేపుతో కొలతలు తీసుకొని చెపుతుంటే షాజహాను పుస్తకంలో రాస్తున్నాడు. ముత్యాల్లాంటి అక్షరాలు. ఏమాత్రం ఒంకరలులేవు. తనచేతివ్రాతని గుర్తుకుతెచ్చుకొని కొంచెం సిగ్గుపడ్డాడు దివాకరం.

"ఎన్నిరోజులలో కుట్టివ్వగలవో ఖచ్చితంగా చెప్పు" అన్నాడు దివాకరం.

"వచ్చేవారం మొత్తం అన్నీ కుట్టి ఇస్తాను సార్ కొంచెం అడ్వాన్సు ఇవ్వండి" అడిగాడు ఖాదిర్.

"ఇస్తాను, ముందు మొత్తం ఎంతవుతుందో చెప్పు" అన్నాడు దివాకరం.

"జతకారొందలుజొప్పునివ్వండి" అన్న ఖాదిర్ మాటలకెదురు చెప్పకుండా ఒక 500 రూపాయిలు అతని చేతిలో పెట్టి ఇంకొక 200 రూపాయిలు తీసి షాజహానుకి ఇవ్వబోయాడు దివాకరం.

కాని వాడు తీసుకోవడానికి నిరాకరిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. తీసుకొమ్మని కొంచం గట్టిగా చెప్పినాసరే వినలేదు. డబ్బు కూడా ఖాదిరికిచ్చి బట్టలకొట్టుదగ్గరకు నడిచాడు దివాకరం.

ఇంకా చీరలు చూస్తూనే ఉంది నీలిమ.

 

" అప్పుడే వచ్చేశావా! ఇంకా నా సెలక్షన్ అవ్వనేలేదు" అంది దివాకరాన్ని చూసి.

 

అయితే నేను వెళ్ళి సోఫాలో రిలాక్స్ అవుతానని దివాకరం అక్కడున్న సోఫాలో కూలబడ్డాడు.కళ్ళు మూసుకొని షాజహాన్ గురించే ఆలోచిస్తున్నాడు దివాకరం.చాలా చురుకైన కుర్రాడు, ఇలా బాల కార్మికుడుగా జీవితాన్ని వృధాచేస్తున్నాడనిపించింది. తానేమీ సాయం చేయలేడా? వాడి జీవితాన్ని మార్చలేడా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఎలాగైనా సరే వాడి జీవితాన్ని మార్చాలనే ధృఢాభిప్రాయానికి వచ్చాడు.

 

"కమాన్ దివా! అయాం డన్" అన్న నీలిమ పిలుపుతో

దివాకరం ఒక్కసారి కళ్ళు తెరచి, సెల్ ఫోనులో టైం చూస్తూ, అబ్బా అప్పుడే ఆరైందా అని, ఆమెతో కలసి బయటకు నడిచాడు.

 

అటువైపుగా వస్తున్న ఆటోలో ఎక్కి ఇంటికి బయలుదేరారు.

 

"బట్టలు ఎప్పుడిస్తానన్నాడు దివా?" అడిగింది నీలిమ .

"వారం లోపలే ఇస్తాడుట" అన్నాడు.

"అబ్బా! అంత తొందరగానా?" అని కొంత ఆశ్చర్యాన్ని ప్రకటించింది.

 

" నీలూ! ఈరోజు ఒక పిటీఫుల్ బోయ్ ని చూశాను" అన్నాడు దివాకరం.

" పిటీఫుల్? ఎక్కడ?" అంది ఆమె.

 

" చెబుతా విను" అంటూ షాజహాను చురుకుదనాన్ని వాడి ప్రవర్తనను నీలిమకి ఒక కధలా వివరించాడు.

 

అదివిని ఎంతో ఎక్సైట్ అవుతుంది అనుకున్న దివాకరానికి, "ఓహో! అది మామూలే దివా వాళ్ళ జీవితాల్లో" అన్న ఆమె సమాధానం, అతన్ని పూర్తిగా నిరాశ పరచింది".

 

ఇంకా బయిట ఎండ ఉక్కపోత. ఇంటికిచేరి స్నానం చేసేసరికి ఒక్కసారి హాయిగా అనిపించి ప్రాణం లేచొచ్చినట్లయింది దంపతులకి.

భోజనం చేస్తున్నసేపు దివాకరం ఆలోచనలన్నీ షాజహను చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా నీలూని కన్వీన్స్ చేసి షాజహాన్ కి ఒక మంచి దారి చూపించాలి అని ఒక ధృడ నిశ్చయానికొచ్చి పడగ్గదిలో మంచంపై నడుమువాలుస్తుండగా నీలిమ వచ్చింది.

 

"నీలూ! మనం షాజహాన్ ని చదివిస్తే ఎలావుంటుంది" అడిగాడు దివాకరం.

"దివా! వాడేమీ చదవడు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. పోనీ వాడికి కొంత డబ్బు ఇవ్వు" అని నీలిమ చాలా తేలిగ్గా కొట్టి పారేసింది. ఆమె మాటలు దివాకరానికి చివుక్కుమనిపించాయి.

 

"నీలూ! వాడికి అహంభావం ఎక్కువ, నేను ఇచ్చిన డబ్బు తీసుకోలేదు తెలుసా? అందరినీ ఒక కాడికి కట్టకూడదు" నిష్టూరంగా అన్నాడు.

భర్తకి కోపం వచ్చిందని అర్ధమైంది నీలిమకి.

 

"నీ ఇష్టం దివా! నీకంతగా ఏదైనా చెయ్యాలనిపిస్తే నేనేమీ అడ్డు చెప్పను. ప్లీజ్ ప్రొసీడ్" అని అతని భుజంపై చేయివేసి కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది.

 

మాటలకి ఎక్కడలేని ఊత్సాహం వచ్చింది దివాకరానికి.ఇక ఇండియాలో ఉండేది రెండు వారాలే కాబట్టి ఇక సమయం లేదని ఆమర్నాడే వాడి చదువు సంగతి చూడాలని నిశ్చయించుకున్నాడు.

 

ప్రొద్దూన్నే లేచి రెడీఅయ్యి ఆటోలో ఖాదిర్ కొట్టుకి బయలుదేరాడు. ఇంతలో మరో ఆలోచన వచ్చింది దివాకరానికి. అసలు వాడు చదువుకున్న స్కూలుకెళ్ళి ఎలా చదివేవాడో ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుందని. ఆలోచన సబబే అనిపించింది. ఒకవేళ చదువులో ఏమాత్ర శ్రద్ధ చూపించకుండా, స్కూలు ఎగ్గొట్టుంటే మాత్రం, ఇప్పుడు తనప్రయత్నం వృధాయే అనుకొని, ఆటోని స్కూలు వైపు పోనీమన్నాడు.

 

హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని, షాజహాను గురించి అడగడం మొదలు పెట్టాడు. స్కూల్ మానేసి ఎన్నో రోజులు కాకపోవడంతో చాలా సులభంగానే హెడ్మాస్టర్ షాజహానుని గుర్తుకు తెచ్చుకున్నారు. చాలా చురుకైన తెలివైన కుర్రాడని చదువుల్లోనే కాకుండా ఆటల్లో కూడా అందరికంటే ముందుండేవాడని తెలపడంతో దివాకరానికి మంచి ఊరట లభించి ఉత్సాహంతో ఖాదిర్ కొట్టుకి చేరాడు.

 

నిన్ననేకదా ఇచ్చి వెళ్ళారు! అప్పుడేవచ్చారేమిటీ అన్న సందేహంతో "నమస్తే సార్" అంటూ కత్తెర తో బట్టలు కత్తిరిస్తున్న ఖాదిర్ బయటికి వచ్చి దివాకరాన్ని అక్కడున్న స్టూల్ పై కూర్చోమన్నాడు.

దివాకరం ఇంక వేరేదేమీ మాట్లాడకుండా

"ఖాదిర్! నీకొక సలహా చెబుతాను, వింటావా" అంటూ అసలు విషయం మొదలుబెట్టాడు.

 

"చెప్పండి సార్" అన్నాడు ఖాదిర్ నెత్తిమీద టోపీ సర్దుకుంటూ.

 

"షాజహాన్ ని స్కూల్ కి పంపించి చదివించు" అన్నాడు.

 

ఇంకా ఏదో పెద్ద విషయం అనుకున్న ఖాదిర్ కి ఆమాట వినగానే ఒక చిన్న నవ్వు నవ్వి, "లేదు సార్! వాడిక్కడ లేకపోతే నాకు కష్టమవుతుంది. అందుకే బడి మానిపించా" అని తిరిగి బట్టలని కత్తిరించడం మొదలుబెట్టాడు.

 

ఖాదిర్ మాటలకు కొంత నొచ్చుకున్న దివాకరం, ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలతో, షాజహాన్ని తాను చదివిస్తానని, చదువుకుంటే పిల్లలజీవితాలు మారడమే గాకుండా తల్లితండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో ఎలా ఆదరింపబడతాయో కొంచెం నచ్చచెప్పే ధోరణిలో ఉదాహరణలతో సహా చెప్పేసరికి ఖాదిర్ కొంచం మెత్తబడి ఆలోచించడం మెదలుబెట్టాడు.

 

ఇదంతా వింటూనే ఏకాగ్రతగా తనపనితాను చేసుకుపోతున్న షాజహాన్ని బయటకు పిలిచి

 

" షాజహాన్! నువ్వు మళ్ళీ స్కూల్ కెళ్ళి చదువుకుంటావా?" అడిగాడు దివాకరం.

ఒక్కసారి కళ్లళ్ళో మెరుపులు మెరిసినా, తండ్రివైపు చూసి తలదించుకున్నాడు షాజహాన్.

గతంలో తను స్కూలుకి వెళతానని మారాం చేయడం, తండ్రి వద్దనిచెప్పడం ఒకసారి కొట్టునుంచి పనిమానేసి స్కూలుకి పోతే, తండ్రి వచ్చి తనని కొట్టుకుంటూ తీసుకొచ్చి పనిచేయించడం చిన్న మెదడు మరచిపోలేదు. అప్పటి నుంచి స్కూలు సంగతి మరచిపోయాడు షాజహాను. అవన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బెరుగ్గా తండ్రి కేసి చూసాడు.

 

వాడికి స్కూల్ కి వెళ్ళడం ఇష్టమేనని గ్రహించాడు దివాకరం. ఖాదిర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

 

"ఏమాలోచించావ్ ఖాదిర్" అన్న దివాకరం మాటలకి ఒక్కసారి లోకంలోకి వచ్చి

 

" సార్! కొంచెం టైం ఇవ్వండి మాఅవిడతో మాట్లాడి చెబుతాను" అన్నాడు.

" నీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా వస్తాను ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం" అన్నాడు దివాకరం.

 

ఖాదిర్ ఇంక ఎదురు చెప్పకుండా, షాజహాన్ కి కొట్టు అప్పగించి, దివాకరంతో కలసి ప్రక్క వీధిలోనున్న అపార్టుమెంటు కాంప్లక్సు దగ్గరకెళ్ళారు. అక్కడ ఖాదిర్ భార్య చిన్నబండి పెట్టుకుని బట్టలు ఇస్త్రీ చేస్తోంది. ఇద్దరి కూతుళ్ళు కాడా అక్కడే ఉన్నారు. వాళ్ళలో పేదరికపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

 

ఆమెకి దివాకరాన్ని పరిచయం చేసి విషయమంతా చెప్పాడు ఖాదిర్. ఆమెకి ఆనందం కలిగినా ఒక్కసారి నిట్టూర్చింది.

 

"అయ్యా మాఇంట్లో అందరూ పనిచేస్తేనే గానీ గడవదయ్యా! వాడు స్కూలికెళితే ఖాదిర్ ఒక్కడూ చేసుకోలేడు. ఇబ్బందవుతుంది"దండంపెడుతూ చెప్పిందామె. ఒక్కసారి నీరుకారిపోయాడు దివాకరం. కానీ ఎలాగైనా ఒదలకూడదనుకున్నాడు.

"ఇదిగో చూడండి! షాజహాను బ్రతుకును మీరు దయచేసి నాశనం చేయకండి. వాడు చదువుకుంటే భవిష్యత్తులో మీకీ కష్టాలుండవు" అని కొంచెం కఠినంగానే చెప్పాడు దివాకరం.

 

భార్య ముఖంలోకే చూస్తున్నాడు ఖాదిర్.

 

ఇక లాభం లేదనుకొని ఆఖరి అస్త్రంగా

 

" చూడు ఖాదిర్! నీకు పనిలో సాయం చేయడానికి ఎవరినైనా పెట్టుకో. ఆజీతం, షాజహాను స్కూలు ఫీజులు, తిండి, బట్టలు ఇతరఖర్చులు కలిపి మొత్తం పది వేలు నెలనెలా ఇస్తాను. నేను షాపు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు ఆలోచించుకొని నాకు ఏవిషయం చెప్పండి" అని దివాకరం వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు.

ఒక్కసారి మొగుడు పెళ్ళాలు గతుక్కుమన్నారు. నెలయ్యేసరికి అతికష్టం మీద అయిదారువేలు సంపాదించేవాళ్ళకి ఇంత పెద్దమొత్తం వినేసరికి కాదనడానికి ఇక ఏకారణం కనపడలేదు.

 

ఆరోజే షాజహాన్ని స్కూలుకి తీసుకెళ్ళి జాయిన్ చేయడం, కావలసినవన్ని కొనివ్వడం జరిగిపోయాయి.

 

ఒక మంచిపనిచేశాననే తృప్తితో దివాకరం మనసు దూదిపింజలా గాల్లో ఎగరసాగింది. చాలా ఆనందంతో ఇల్లు చేరుకున్నాడు.

 

"నీలూ! ఎక్కడున్నావ్?" అని పిలిచేలోగా, ఆటో శబ్దం వినబడి తనే పెరట్లోంచి ఇంట్లోకి వచ్చింది.

 

దివాకరం మొహం వెలిగిపోవడం చూసి అన్నీ అతను అనుకున్నట్టే జరిగి ఉంటాయని ఊహించుకుంది. దివాకరానిది చిన్న పిల్లాడి మనస్తత్వం. సంతోషమైనా విచారమైనా మొహం మీదే తెలిసిపోతుంది. జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించాడు నీలిమకి.

బాగా అలసిపోయాడేమో! భొజనం చేసి మంచం మీద చేరిన వెంటనే నిద్ర కమ్ముకొచ్చింది దివాకరానికి.

 

తను దేశం వదలివెళ్ళే ముందురోజు ఖాదిర్ చేతిలో పది వేలు పెట్టి నెలనెలా బాంకులో డబ్బు జమచెస్తానని హామీ ఇచ్చి, షాజహాన్ని బాగా చదువుకోవాలని హితబోధ చేసి భార్యతో కలసి ఫ్లయిట్ ఎక్కి వచ్చేసాడు దివాకరం.

ఉరుకుపరుగుల యాంత్రిక జీవితంలో వారాలు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. వారాంతరాలు ఇంట్లో, బజార్లో పనులతో సరిపోతున్నాయి. ఠంచనుగా నెల నెలా ఖాదిర్ కి డబ్బు పంపిస్తున్నాడు దివాకరం.

వీలు కుదిరినప్పుడల్లా ఫోనులో మాట్లాడుతున్నాడు. షాజహాను క్రమం తప్పకుండా స్కూల్ కి వెళుతున్నాడని, బాగా చదువుతున్నాడని విని చాలా సంతోషించేవాడు. నీలిమతో కూడా ఆవిషయం పంచుకొని ఇద్దరూ ఆనందించేవారు.

 

గిర్రున ఏడాది తిరిగిపోయింది. ఒక్కసారి ఇండియా వెళ్ళొద్దాం రెండు వారాలకి అని అనుకుంటున్న దివాకరానికి, పిల్లలు భార్యా యూరప్ ట్రిప్ వెళదాం అనేసరికి కాదనలేకపోయాడు. సెలవంతా అయిపోవడంతో ఇక ఇండియా ప్రయత్నాన్ని సంవత్సరం విరమించాడు. తన స్నేహితులెవరైనా ఇండియా వెళుతుంటే వాళ్ళతో షాజహాను కోసంబట్టలు బూట్లు చాక్లేట్లు వంటివి పంపేవాడు. అప్పుడప్పుడు ఖాదిర్ తో ఫోనులో మాట్లాడడం, నెల నెలా క్రమం తప్పకుండా డబ్బుపంపడం కొనసాగిస్తూనే ఉన్నాడు.

 

మరదలి పెళ్ళి ముహూర్తం పెట్టామని మామ గారు ఫోను చేయటంతో, ఆర్నెల్లు ముందుగానే భార్యా పిల్లలతో ఇండియా వెళ్ళడానికి టిక్కట్ట్లు బుక్ చేయించాడు. చాలా ఆనందంగాఉంది దివాకరానికి, ఈవంకనైనా షాజహాన్ని కలవచ్చని. అప్పటికి రెండు సంవత్సరాలవుతుంది స్కూల్లో చేర్చి. ఫోను చేసినప్పుడల్లా ఖాదిర్ చెబుతున్నాడు, బాగా చదువుతున్నాడని, స్కూల్లో అందరికంటే ముందుంటున్నాడని. ఆమాటలువిని దివాకరం పొంగిపోతున్నాడు. పెద్ద క్లాసుల్లోకి వెళుతున్నాడు కాబట్టి ట్యూషను పెట్టిస్తే బాగుంటుందని తన మిత్రులద్వారా వాకబు చేసి, ఒక పేరున్న ట్యూషను సెంటర్ ని ఎంపికచేసి వాళ్ళతో ఫోనులో మాట్లాడి, అడ్వాన్సు చెల్లించి సీటు రిజర్వ్ చేయించాడు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ మంచి కాలేజి లో జాయిన్ చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.

 

ఇండియా చేరిన మరునాడే షాజహను కోసం పట్టుకొచ్చిన గిఫ్టులు బట్టలు పట్టుకొని ఆటోలో బయలుదేరాడు దివాకరం.

"జూన్ నెలైనా ఎండ విపరీతంగా ఉందేంటయ్యాబాబు" ఆటోడ్రైవర్ తో మాట కలిపాడు.

"ఈరోజుల్లో ఆనెలా ఈనెలా అని లేదుసార్ ఏడాదికి పది నెల్లు ఎండే" అని నిట్టూర్చాడు ఆటోడ్రైవర్.

 

గాలి వీస్తుండటంతో ఉక్కపోత లేదు. తిన్నగా ఖాదిర్ కొట్టుకి తీసుకుపొమ్మన్నాడు ఆటోని. వెళ్ళేసరికి తాళం వేసిఉంది. ఖాదిర్ ఫోనుకి ప్రయత్నిస్తే అందుబాటులో లేదని వస్తోంది. భోజనానికో లేదా నమాజుకో వెళ్ళి ఉంటాడనుకొని తిరిగి ఆటోలో షాజహాను స్కూలికి బయలుదేరాడు. ఆరోజు రెండో శనివారం శెలవట, స్కూలు మూసేసి ఉంది. ఇల్లెక్కడో తెలియదు, షాజహాను తల్లి ఇస్త్రీ చేసే అపార్ట్మెంటు గుర్తుకొచ్చింది. కానీ పేరు గుర్తు లేదు, లీలగా దారి గుర్తుంది. తను గుర్తులు చెబుతుంటే ఆటో వెళుతోంది, మొత్తానికి అక్కడికి చేరుకున్నారు. బండుంది గానీ, ఎవరో ఒకతను తలపాగా కట్టుకొని ఇస్త్రీ చేసుకుంటున్నాడు. వివరాలడిగితే తనొచ్చి ఆర్నెల్లవుతోందని ఎవరూ తెలియదన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు దివాకరానికి. తిరిగి ఆటోని కోటగుమ్మంవద్దకు పోనీమ్మని, అక్కడ దిగి డబ్బులిచ్చి పంపించేశాడు. తల బద్దలుకొట్టేస్తోంది అర్జంటుగా స్టాంగ్ కాఫీ తాగుదామని ప్రక్కనే కనిపిస్తున్న హొటల్ వైపు దారితీసాడు. కాఫీ త్రాగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈపాటికి ఖాదిర్ వచ్చి ఉంటాడేమో ఒక్కసారి మళ్ళీ ఖాదిర్ కొట్టువద్దకెళదాం అని నిర్ణయించుకొని, చేతిలో సామాను బరువుగా ఉండటంతో ఆటొ ఎదైనా వస్తుందేమోననని కాసేపు ఎదురుచూసి ఇక లాభం లేదనుకొని నడక ప్రారంభించాడు. మెల్లిగా ఖాదిర్ కొట్టుకి చేరాడు. ఇంకా తాళం అలాగేఉంది. చుట్టూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక ప్రక్కన బిల్డంగ్ నీడలో నిలబడ్డాడు. ఖాదిర్ ఫోనుకి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి అదే సమాధానం. విసుగ్గా ఫోను జేబులో పెట్టుకుని ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని సిద్ధమౌతుండగా, ఖాదిర్ కొట్టు ముందు సైకిల్ పై ఒక వ్యక్తి దిగి, కొట్టు తాళం తీస్తున్నాడు. దివాకరం గబగబా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. తాళంతీసి ఆవ్యక్తి లోపలనుంచి కొన్ని గోనె సంచులు తీసుకొని బైటకొచ్చాడు. లోపల కుట్టు మిషన్ ఏమీ కనిపించలేదు దివాకరానికి. బయటికొచ్చిన వ్యక్తి ఏం కావాలన్నట్లుగాచూస్తుంటే, ఖాదిర్ గురించి అడిగాడు దివాకరం.

"ఖాదిర్ కి మీరేమవుతారు" అన్న అతని ప్రశ్నకి దివాకరం సమాధానం చెప్పగానే వ్యక్తి ఒక్కసారి గతుక్కుమని లోపలకి తీసుకువెళ్ళి లోపలకి తీసుకువెళ్ళి దివాకరాన్ని స్టూలుపై కూర్చోమని తను క్రింద కూర్చుంటూమీరు ఖాదిర్ తో ఆఖరు సారి ఎప్పుడు మాట్లాడారు సార్" అనడిగాడు.

సుమారు ఆరు నెలలై ఉంటుందని, తరువాత రెండుమూడు సార్లు ప్రయత్నించినా ఫోను కలవలేదని చెప్పాడు దివాకరం.

సమాధానం విన్న ఆవ్యక్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

ఉండండి సార్ టీ పట్టుకొస్తాను" అంటూ , దివాకరం వద్దని వారిస్తున్నా వినకుండా బయటికివెళ్ళి పది నిమిషాల్లో రెండు కప్పులతో టీ తీసుకొచ్చి, ఒకటి దివాకరానికిచ్చి రెండోది తను తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. ఆవ్యక్తి చెప్పే సమాచారం వింటుంటే కళ్ళు బైర్లుతిరుగుతున్నాయి దివాకరానికి. చెప్పిందంతా విన్నాకా ఒక్కసారి కాళ్ళకింద భూమి చీలిపోయి తాను అందులో కూరుకుపొయినట్లనిపించింది. కళ్ళుమూసుకొని నీరసంగా గోడకి జారగిలపడ్డాడు.

నోటమాట రావడంలేదు. కాసేపటికి స్థిమితపడి, ఆవ్యక్తిని ఆటో తీసుకురమ్మని చెప్పి, అందులో కూలబడి ఇంటికి తిరిగి పయనమయ్యాడు దివాకరం.

 

ఇల్లంతా పెళ్ళికొచ్చిన చుట్టాలతో హడావిడిగా ఉంది. దివాకరాన్ని చూసిన నీలిమ ఆశ్చర్యపోయింది.మొహమంతా నల్లగా మాడిపోయి పది లంఖణాలు చేసినివాడిలా ఉన్నాడు. ఉదయం షాజహానుకోసం పట్టుకొని వెళ్ళినవన్నీ తిరిగి తీసుకొనిరావడంతో ఒకింత ఆదుర్దా పడి, గదిలొకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఫ్రిజ్ లోంచి చల్లని మంచినీళ్ళు పట్టుకొచ్చి ప్రక్కన కూర్చుని అతనికిస్తూ

 

"దివా! ఆర్ యూ ఓకే?" అని ఆమె అడగ్గానే, ఒక్కసారి దుఃఖం పొంగి పొర్లింది దివాకరానికి. ఆమె రెండు చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు.

 

ఒక్క నిమిషం తరువాత స్థిమితపడి " వ్యక్తి" ఇచ్చిన సమాచారాన్ని నీలిమకు చెప్పడం ప్రారంభించాడు.

 

"ఖాదిర్ కొన్ని రోజులపాటు షాజహాన్ని స్కూలుకి బాగానే పంపాడు. దివాకరం చెప్పినట్లుగా కొట్లో ఇంకెవర్నీ పనిలోకి పెట్టుకోలేదు. షాజహాన్ని స్కూల్ అయిపోయిన తరువాత కొట్టుకి తీసుకువచ్చి రాత్రి దాకా పనిచేయించేవాడు. నెల నెల ఖచ్చితంగా దివాకరాన్నించి డబ్బు అందుతూండటంతో అప్పటికే మద్యం అలవాటున్న ఖాదిర్ దాని పరిణామాన్ని ఇంకా పెంచి, త్రాగుడికి పూర్తిగా బానిసయ్యాడు. దానికి తోడు పేకాట కూడా జోడవడంతో కొన్ని రోజులపాటు షాపు తీసేవాడు కాదు. దానితో బేరాలు బాగా తగ్గిపోయాయి. పగలంతా పేకాట రాత్రంతా మత్తుతో సంసారాన్ని పట్టించుకోవడం మానేశాడు. అప్పటికే ఫీజులు కట్టకపోవడంతో అనేక హెచ్చరికల తరువాత షాజహాన్ని స్కూల్ నుండి తీసేసారు. దివాకరం ఫోను చేసినప్పుడల్లా అబద్ధాలు చెప్పేవాడు.ఇల్లంతా రోజూ నరకంలా తయారైంది. భార్యసంపాదనతోనే ఒకరోజు తింటే ఒకరోజు తినేవారుకాదు. పేకాటాడి సాయంత్రానికి తాగి ఇంటికి రావడం, భార్యా భర్తలు గొడవపడడం, దొరికింది పుచ్చుకొని భార్యని కొట్టడం చుట్టుప్రక్కలవాళ్ళకి ఇది రోజూ ఉచిత వినోదంలా ఉండేది. షాజహాన్ కి తండ్రి ప్రవర్తన చాలా చికాకు పుట్టిస్తోంది. కానీ ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇద్దరి అక్కలదీ కూడా అదే స్థితి.

 

ఒకరోజు రోజూలాగే ఫుల్ గా త్రాగి ఇంటికివచ్చాడు ఖాదిర్ . అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి వేసారిపొయిన భార్య , లోపలకి రావద్దని గుమ్మనికి అడ్డంగా నుంచుంది. ఇద్దరికీ పెద్ద పెనుగులాటజరుగుతోంది. ఒక్కసారి భార్యని నేలమీదకి తోసేసాడు. త్రాగుడు మైకంలో తనేంచెస్తున్నాడో తనకే తెలియడం లేదు. పూర్తిగా విచక్షణ కోల్పొయాడు. ప్రక్కనే ఉన్న పచ్చడి బండని తీసుకొని భార్య తలపై గట్టిగా మోదాడు. ఇదంతా నిశ్చేష్టపోయి చూస్తున్న షాజహాన్ కి విపరీతమైన కోపం ఉద్రేకం కలిగాయి. ఒక్కసారి తండ్రిమీదకి ఉరికాడు. క్రిందపడేసి అదే పచ్చడి బండని తీసుకొని తండ్రి తలపై కసిగా మోదుతూనేఉన్నాడు. అతన్ని ఆపడానికి అక్కలిద్దరు చేసిన ప్రయత్నం మొండిబలం ముందు వెలవెల బోయింది. అప్పటికే భార్యా భర్తలిద్దరి ప్రాణాలు గాల్లో కలసి పోయాయి. ప్రస్తుతం షాజహాను చిన్నపిల్లల జైలులో ఉన్నాడు. అతని అక్కలిద్దరూ ఎమైపోయారో ఎవరికీ తెలియదు."

చెప్పడం పూర్తిచేసిన దివాకరం, నీలిమ కళ్ళలోకి చూస్తూ " నేను తప్పుచేశానంటావా" అని బేలగా అడుగుతుంటే, ఆమె దుఃఖం ఆపుకోలేకపొయింది.

 

 

No comments:

  గోపాలం మాస్టారు   ఉ దయం 6 గంటలకు ఒక ఎత్తఱుగుల ఇంటి దగ్గర సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు. ఒక మూడో తరగతి అబ్బాయి మూడో ఎక్కం అప్పజపుతుంటే ...