Sunday, July 10, 2022
Sunday, May 01, 2022
జరీ జాతకం
- శాయి
ప్రభాకర్ యఱ్ఱాప్రగడ
"అరగంట నుంచి ఈ ముక్క కోసమే చూస్తున్ననోయ్ ", అంటూ బాబి వేసిన ఇస్పేట్ ఆసుని తీసుకొని ‘షో’ చూపించాడు దీక్షితులు.
" అబ్బా!
గురువు గారు, మీరు రాజు, మదం కొట్టాకే
ఆసొదిలాను " అని సనుక్కుంటూ "కౌంటు" అంటూ చేతిలొనున్న ముక్కలని చాప
మీద పడేసాడు బాబి. ఇంచుమించు అదే లెక్కల్లో సమర్పించుకున్నారు శర్మ, కిష్టప్ప మరియు రాంబాబు.
వచ్చిన డబ్బుని జేబులో
వేసుకొని, ఒక్కసారి
వ్రేళ్ళమధ్య నొక్కిపెట్టి ఉంచిన ముక్కుపొడాన్ని గట్టిగా పీల్చి, "ఇక లేస్తానోయ్, ఆవుకి గడ్డి వేయాలి", అని ఉత్తరీయం పైన వేసుకొని లేచాడు దీక్షితులు.
దీక్షితులు వయస్సు సుమారు
డబ్భై ఉంటుంది. వంశపార పర్యంగా వచ్చిన వైదిక వృత్తితో పాటు, దానంగా వచ్చిన రెండు ఆవుల
ఆలనా పాలనా స్వయంగా చేసుకుంటాడు. మరియూ జ్యోతిష్యంలో “మంచి దిట్ట” అనే పేరు
సంపాదించాడు. ఆ వూరివాళ్ళే గాకుండా చుట్టుప్రక్కల జనాలు కూడా దీక్షితుల దగ్గరికి
ప్రశ్నకోసం వస్తూంటారు. కానీ దర్శనం మాత్రం ఒక పట్టాన దొరకదు. తద్దినాలు, వ్రతాలు, పెళ్ళిళ్ళతో పాటు పేకాట కూడా ఒక వృత్తిలా
భావించే దీక్షితులు, ఎవరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండడు.
ఎవరికైనా దొరికాడంటే అది వాళ్ళ అదృష్టమన్నట్లే లెక్క.
బాబి ఊళ్ళో ఒక పేరుమోసిన
చిన్న సైజు జమిందారు. తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిని ఒబ్బిడిగా
కాపాడుకుంటూ,
అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ, చాలా
గౌరవంగా బ్రతుకుతున్నాడు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళైపొయాయి. దీక్షితుల్లాగే బాబికి
కూడా పేకాట పిచ్చి, తన ఇంట్లోనే ఒక గదిని పేకాట అడ్డాగా
మార్చడంతో, ఆ జాతి పక్షులన్నీ అక్కడికే చేరి కాలక్షేపం
చేస్తూంటాయి.
****************************************************
"అయ్యగారున్నారండి
అమ్మగారు? " అంటూ పాల చెంబుని బాబి భార్యకి అందించి
అరుగుపై చతికిలపడ్డాడు వరదయ్య.
వరదయ్య సుమారు పాతిక
ముప్ఫై ఏళ్ళుగా బాబి తండ్రి హయాం నుంచీ పొలంపనులూ, ఇంటిపనులూ చేస్తూ ఒక ఇంట్లో
మనిషిగా ఉంటున్నాడు. ప్రొద్దుటే పాలు పట్టుకు వచ్చి, బాబికి
చుట్టలు చుట్టివ్వడం వరదయ్య దినచర్యలో ఒక భాగం.
బాబి వచ్చి అరుగు మీదున్న
చెక్కసోఫాలో కూర్చున్నాడు.
"అయ్యగారూ!
మా వోడిది అదేదో టయింగంటండి, ఇంకో నెల్లో అయిపోతాదంటండి,
అంతా మీ దయేండి బాబు", అంటూ చుట్టిన
చుట్టొకటి బాబి చేతికిచ్చాడు వరదయ్య.
"ఓ
ట్రైనింగా! నా దయేంటిరా! అంతా ఆ దేవుడి దయ. కిట్టిగాడు కష్టపడి చదువుకున్నాడు,
పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాడు", అన్నాడు
బాబి.
"అలాగనకండి
బాబు, మీరే కనక పూనుకోబోతే మా బతుకులకీ సదువులు ఉజ్జోగాలు
ఎట్టాగండి? మీరే మా దేవుడండయ్యా" అంటూ చేతులు జోడించాడు
వరదయ్య.
వరదయ్యకి ఇద్దరు కొడుకులు.
పెద్దాడు నారాయుడు తాగుడికి బానిస. తనకి కళ కుదిరినప్పుడు కూలిపనులకెళుతూంటాడు.
లేని రోజున తాగుడు డబ్బులకోసం తండ్రితో గొడవ పడుతూంటాడు. రెండోవాడు కృష్ణ. అందరూ
కిట్టిగాడంటారు. అన్నలాకాకుండా బుద్ధిమంతుడు. వాడి చురుకుతనం, ఉత్సాహం చూసి బాబి
చిన్నప్పటినుంచీ బాగా ప్రొత్సహిస్తూ ఉండేవాడు. కిట్టిగాడిని డిగ్రీ దాకా చదువు
చెప్పించి, పోలీసు ఉద్యోగానికి కావలసిన కోచింగుకి కూడా
పంపించాడు. దానికి వాడి యొక్క కష్టం, పట్టుదల తోడవటంతో మొదటి
ప్రయత్నంలోనే పోలీసు ఉద్యోగం సాధించి, ప్రస్తుతం ట్రైనింగులో
ఉన్నాడు.
మధ్యాహ్నం ఒంటిగంట
అవుతోంది.మధ్యాదిన మార్తాండుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాబి ఇంటిముందు
సైకిలు స్టాండు వేసి ఉత్తరీయాన్ని తలపాగా చుట్టుకొని "భోజనం అయిందోయ్"
అంటూ లోపలికి వచ్చాడు దీక్షితులు.
"ఆ
ఇప్పుడే! పదినిమిషాలైంది, రండి కూర్చొండి" అంటూ సోఫా
చూపిస్తూ చుట్ట వెలిగించాడు బాబి.
కాసేపు పిచ్చాపాటీ
మాట్లాడుకున్నాకా,
బాబీ అన్నాడు " గురువుగారు! ఎప్పటినుంచో అడుగుతున్నాను నా
జాతకం రాయమని, మీరసలు కనికరించట్లేదు. అదిగో ఇదిగో అంటూ
దాటేస్తున్నారు ".
" నీకేమిటోయ్
"జరీ జాతకం"! భేషుగ్గా కనపడుతుంటేను, భార్య గుణవతి,
ముత్యాల్లంటి పిల్లలు, మనవలు, కన్నుల పండగలాంటి కుటుంబం, జాతకం చూడాల్సిన అవసరం
ఏమాత్రం లేదు", అంటూ ఒక్క పట్టు పొడుం పీల్చాడు
దీక్షితులు .
“అదేం
కుదరదు, ఈసారి ఎలాగైనా చక్రం వేయాల్సిందే” అంటూ, బాబి పుట్టినపుడు ఆయన తండ్రి డైరీలో వ్రాసుకున్న వివరాలను ఒక కాగితంపై
వ్రాసిచ్చాడు బాబి.
సరేలే చూద్దాం అని తల
పంకిస్తూ , ఆ
కాగితాన్ని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు దీక్షితులు .
రెండుమూడు రోజుల తరవాత, చాకలకి బట్టలు వేస్తూ జేబులు
వెతుకుతుంటే, ఒక చీటి కనబడింది దీక్షితులు భార్య సుబ్బమ్మకి.
భర్తకి భోజనం వడ్డిస్తుంటే ఆ చీటి సంగతి గుర్తొచ్చి,
“మీ
చొక్కాలో ఇదేదో కాగితం ఉంది చూడండి” అంటూ గూట్లోంచి తీసి భర్తకిచ్చింది ఆమె. అది బాబి
జాతకం గురించి ఇచ్చిన వివరాల తాలూకుది.
"అవును
కదూ! మరిచేపోయాను, ఈరోజు దీనిమీద కూర్చోవాలి" అనుకుంటూ
భోజనం ముగించాడు దీక్షితులు.
మధ్యాహ్నం ఒక కునుకులాగి, పాత పంచాంగాల కట్టనుంచి
కావలసినది తీసుకొని, బాబి జాతకం వ్రాయడానికి ఉపక్రమించాడు
దీక్షితులు. సుమారు నాలుగైదు గంటలు పాటు ఒక అరడజను దాకా జ్యోతిషశాస్త్రానికి
సంబంధించిన గ్రంధాలను తిరగేస్తూ చక్రం వేసి, రాశులను గణిస్తూ
లెక్కలను వ్రాసుకున్నాడు. ఇప్పటివరకూ ఎన్నో జాతకచక్రాలు వేసిన దీక్షితులు ఇంతగా
శ్రమ పడిన సందర్భాలు లేవు. ఒకటికి పదిసార్లు చూసుకున్నాడు.ఎక్కడా పొరపడలేదే?
ఏమిటి ఈ జాతకం ఇలా చూపిస్తోంది? నేనూహించిన
జరీ జాతకంలా లేదే? ఇచ్చిన వివరాలలో ఎమైనా తేడా ఉందా? ఆస్కారం లేదు, బాబి తండ్రి తన డైరీలో స్వదస్తూరీతో
వ్రాసుకున్నదది అనుకుంటూ, దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయాడు.
బాబి జాతకాన్ని
సుబ్బయ్యశాస్త్రికి చూపించి ఇంకొకసారి నిర్ధారణ చేసుకుందామని, మరునాడుదయమే సైకిలుపై
పొడగట్లపల్లి బయలుదేరాడు. అది దీక్షితులు గురువు నరసింహశాస్త్రి ఊరు . ఆయన కాలం
చేసి చాలా కాలమైంది. సుబ్బయ్యశాస్త్రి - నరసింహశాస్త్రి కుమారుడు. దీక్షితులు,
సుబ్బయ్యశాస్త్రి కలిసే నరసింహశాస్త్రి వద్ద జ్యోతిషశాస్త్రం
నేర్చుకున్నారు.
ఇద్దరూ కూర్చుని
చర్చించుకుంటూ మళ్ళీ తిరిగి వ్రాశారు. అదే ఫలితం చూపిస్తోంది. దీక్షితులు చేసిన
గణాంకాలు నూటికి నూరు శాతం ఒప్పే అని సుబ్బయ్యశాస్త్రి నిర్ధారించాడు. బాబికి ఎలా
చెప్పాలా అని తర్జనభర్జన పడుతూ మెల్లిగా సాయింత్రానికి ఇల్లు చేరుకున్న్నడు
దీక్షితులు, రాత్రంతా
ఆలోచించి జాతక వివరాలు బాబికి చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు.
"అమ్మగారూ
పాలు", అంటూ వీధి అరుగు పై చతికిలపడ్డాడు వరదయ్య.
"ఎనిమిదైంది,
ఇప్పుడా పాలు పట్టుకు రావడం? ఈరోజు ఇంత ఆలస్యం
అయిందే?", అంటూ కొంచెం కోపంగా అడిగింది సుగుణమ్మ.
"పొద్దున్నించి
నారాయుడు ఒకడే గొడవండి" అంటూ నిట్టూర్చాడు వరదయ్య.
"మీకిద్దరికీ
ఎప్పుడూ ఉండేదేగా వీధుల్లో పడి కొట్టుకోవడం! ఇందులో క్రొత్తేముంది", అంటూ పాల చెంబట్టుకొని లోపలికి వెళ్ళింది ఆమె.
కాసేపటికి బయటికి వచ్చిన
సుగుణమ్మ, ఇంకా
వరదయ్య అక్కడే కూర్చుని ఉండటం చూసి,"అయ్యగారితో పనేమైనా
ఉందా" అని అడిగింది.
"మరేంలేదండి,
దీపావలొత్తోంది కదండి, నారాయుడు టపాకాయలు,
జువ్వలు చేసి అమ్ముతాడంటండి", అన్నాడు
వరదయ్య.
"అవునా,
మంచిదేకదా! నాలుగు డబ్బులొస్తాయి", అంది
సుగుణమ్మ.
" కానండీ!"
అంటూ నసుగుతున్నాడు వరదయ్య.
"తాటాకు
కొట్టి ఆరెట్టుకోవాలి కదండి! మా ఇంటికాడ అసలు కాలీ తలం లేదండి. మన తోటలో షెడ్డుకాడ
మెరకలో తాటాకు ఆరెట్టుకొని, షెడ్డులో సరకు సేత్తాడంటండి.
అయ్యగారిని అడగమని పొద్దున్నించి సతాయించేత్తన్నాడండి"అని అసలు విషయం
బయటపెట్టాడు వరదయ్య.
"అయ్యగారు
బయటికెళ్ళారు, ఎప్పుడొస్తారో ఏమో!" అని సుగుణమ్మ
లోపలికి వెళ్ళిపోయింది.
ఆ మర్నాడు బాబిని షెడ్డు
విషయమై కదిపాడు వరదయ్య.
"వాడి
సంగతి తెలుసుండి కూడా నువ్వెలా అడుగుతున్నావురా? అసలు వాడికి
నిలకడెక్కడేడిసింది? నువ్విచ్చే డబ్బుతో తాగి
తందనాలాడతాడు" అంటూ ఓక్కసారి కస్సుమన్నాడు బాబి.
"అట్టా
అనమాకండయ్యగారు! ఆడు సతాయించేత్తన్నాడండి" అంటున్న వరదయ్య మాటని
వినిపించుకోకుండా లోపలికెళ్ళిపోయాడు బాబి.
తరవాత రెండుమూడు సార్లు
వరదయ్య ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా బాబి కోపం ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఇక లాభం లేదనుకొని ఒక రోజు
నారాయుడిని తీసుకొని సుగుణమ్మ దగ్గరకి వచ్చాడు వరదయ్య.
"అమ్మగారు!
అయ్యాగారసలు ఇనిపించుకోట్లేదండి. ఓ…! సికాకు పడిపోతున్నారు. ఈడేమో
నేనడగట్లేదనుకొని ఏపుకు తింటున్నాడండి. తవరే అయ్యగారికి సెప్పి
ఒప్పించండమ్మా!" అని తండ్రీకొడుకులిద్దరూ సుగుణమ్మ కాళ్ళపై పడ్డారు.
సుగుణమ్మ హృదయం ఒక్కసారి
కరిగి పోయింది. "సర్లే! లేవండి నేను అయ్యగారికి చెప్పి ఒప్పిస్తాలే. రేపో
ఎల్లుండో కనబడండి" అంటూ వాళ్ళకి అభయం ఇచ్చింది.
మర్నాడు మధ్యాహ్నం బాబికి
భోజనం పెడుతూ,
"ఏవండీ!వరదయ్య మన తోటలో షెడ్డు గురించి అడిగాట్ట కదా?"
అంది సుగుణమ్మ.
"అవును,
వాడడిగింది నారాయుడి కోసం. దీపావళికి మందుగుండు సామాను చేస్తాట్ట.
వాడి సంగతి తెలుసుండీ ఎలా ఇస్తాం? కుదరదని కరాఖండీగా
చెప్పాను" అన్నాడు బాబి.
"కాదండి,
ఒక్కసారి అలోచించండి. నెల రోజులే కదా! కాస్త ఎదో నాలుగు
డబ్బులొస్తాయని ఆశ పడుతున్నాడు. నేను మీతో చెప్పి ఒప్పిస్తానని మాటిచ్చాను. ఈ
ఒక్కసారికి ఒప్పుకొండి" అని బ్రతిమాలే ధోరణిలో సుగుణమ్మ అడిగేసరికి, బాబికి ఒప్పుకోక తప్పలేదు చివరికి.
****************************************************************
మర్నాడు ఉదయం వరదయ్య
కిట్టిగాడిని కూడా తనతోబాటు తీసుకు వచ్చాడు బాబి ఇంటికి.
"అయ్యగారూ!
ఈడు రాత్రొచ్చాడండి", కిట్టిగాడికేసి
"చెప్పరా" అంటూ చూశాడు వరదయ్య.
కిట్టిగాడు వంగి బాబి
కాళ్ళకి దండం పెట్టి "ట్రైనింగు పూర్తి అయిందయ్యగారు, మనూళ్ళోనే కానిస్టేబుల్ గా
పోస్టింగిచ్చారండి" అని చెప్పగానే, ఒక్కసారి బాబి ముఖం
వెలిగిపోయింది.
"సుగుణా,
ఇలారా ఒకసారి" అంటూ ఇంట్లోఉన్న భార్యని పిలిచి, తను విన్న విషయం చెప్పగానే,
"ఉదయాన్నే
మంచి విషయం చెప్పావురా! ఉండు" అంటూ సుగుణమ్మ లోపలికి వెళ్ళి ఒక బెల్లం ముక్క
పట్టుకొచ్చి కిట్టిగాడి చేతిలో పెట్టింది “నొట్లో వేసుకోమంటూ”.
సరిగ్గా అదే సమయానికి
దీక్షితులు ప్రవేశించాడు.
విషయం తెలుసుకొని
"శుభం రా కిట్టిగా,
ఇంక నీ జీవితం గట్టెక్కేసింది, ఎన్ని
జన్మలెత్తినా బాబిగారి ఋణం తీర్చుకోలేవు", అంటూ సోఫాలో
కూర్చున్నాడు దీక్షితులు.
"అంత
పెద్దమాటలెందుకు గురువుగారు! ఎదో చేతనైన సాయం చేసానంతే", “సరే గానీ నా జాతకం చూడ్డం మొదలెట్టారా?” అంటూ బాబి
చుట్ట వెలిగించాడు.
"చూడు
బాబి! వితరణ అన్నది ఒక వరమయ్యా. నీకన్నా డబ్బున్నవాళ్ళెంతమందిలేరీవూళ్ళో! ఆ
అదృష్టం అందరికీ దక్కదు. నువ్వు చెయ్యి విదలించని వాళ్ళు బహు తక్కువ. తెలిసినవి
కొన్నే అయితే,మరో చేతికి కూడా తెలియకుండా చేసినవి ఎన్నో. మా
సత్యవతమ్మ వివాహం నేను చేయగలిగేవాడినా నీ అండ లేకుండా?" అని అంటుంటే ఒక్కసారి బాబి జాతకం గుర్తొచ్చి గొంతు జీరబోతూండగా, అతని భుజంపై చెయ్యివేసి "వస్తానయ్యా" అంటూ లేచి బయటికి
వచ్చేశాడు దీక్షితులు.
ఆరోజు నరకచతుర్దశి. బాబి
ఉదయాన్నే సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. కాసేపటికి, వీధిలో కోలాహలం కనపడింది.
కొందరు సైకిళ్ళపైన, కొందరు పరిగెడుతూ వెళ్ళడం కనిపించింది.
ఎమై ఉంటుందబ్బా అనుకుంటూ వీధి గేటువైపు అదుగులు వేసాడు. ఒక పదినిమిషాల తరువాత
ఇద్దరు వచ్చి బాబితో చెబుతున్నారు. మందుగుండు పేలి బాబి తోటలో షెడ్డు కాలిపోతోందని,
పక్క వూరినుంచి ఫైరింజన్ వస్తోందని, ఈలోపులో
జనం మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారని, షెడ్డులో
ఎంతమందున్నారో ఇంకా తెలియదని.
తరవాత మాటలేవీ బాబికి
వినపడటంలేదు. ఒక్కసారి కొయ్యబారిపోయాడు. “అసలేం జరిగుంటుంది? ఎలా జరిగుంటుంది?” అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
కాసేపటికి వగరుస్తూ వరదయ్య
వచ్చాడు. వస్తూనే పెద్ద పెద్ద ఏడుపులతో, "అయ్యగారూ! శానా గోరం జరిగిపోనాదండి,
నారాయుడు ఇంక లేడండయ్యా!” అంటూ బాబి కాళ్ళదగ్గర కుప్పకూలిపోయాడు.
ఆ ఏడుపులకి సుగుణమ్మ
బయిటకొచ్చింది. చుట్టుపక్కల జనం పోగయ్యారు. వరదయ్యని ప్రక్కకు తీసుకెళ్ళిపోయారు.
దీక్షితులు కూడా అక్కడికి చేరుకున్నాడు. బాబీ నువ్వేమీ కంగారుపడకు అన్నట్లుగా
భుజంపై చెయ్యి వేసి దగ్గరకి తీసుకున్నాడు.
నారాయుడి మృతదేహాన్ని
పొస్టుమార్టంకి తరలించారు.ఒక గంట పోయేసరికి బాబి ఇంటిముందు కానిస్టేబులు
కిట్టిగాడు, వాళ్ళ
ఎస్సై జీపులో దిగారు.
ఊళ్ళో ఎన్నో కేసులని
పోలీసుస్టేషన్ కి వెళ్ళకుండా సెటిల్ చేసిన బాబి అంటే ఆ ఎస్సైకి అపారమైన గౌరవం.
చుట్టూఉన్న జనానికి ఎదో సినిమా చూస్తున్నట్లుగా ఉంది.
పోలీసులు ఊళ్ళోకి
వచ్చారంటేనే అవమానంగా భావించే పల్లెటూరి సంస్కృతిలో, ఏకంగా తమ ఇంటికే రావడం ,
అందులోనూ బాబి కోసం కావడం. ఆ దంపతులిద్దరూ చిగురుటాకుల్లా
వణికిపోతున్నారు.
ఎస్సై దీక్షితులు దగ్గరగా
వచ్చి "ఒక్కసారి నాతో రండి" అంటూ బయటికి నడిచాడు.
" చూడండి!
జరిగిన ఘోరంతో బాబిగారికి సంబంధం లేదని మీ అందరిలాగే నాకు తెలుసు. కానీ అనుమతి
లేకుండా ఇటువంటి పనులు చేయడం చట్టరీత్యా నేరం. ప్రమాదం జరిగిన ప్రదేశం బాబిగారిది.
పోలీసు రిపోర్టు ప్రకారం ఒక తోటలోని షెడ్డులో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా
చేస్తున్న మందుగుండు సామాగ్రి పేలి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ షెడ్డు
యజమానిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచవలెను అని ఉంది.
వ్యక్తి ప్రాణం పోయింది
గాబట్టి నాన్ బెయిలబుల్ వారంట్ ఇవ్వబడింది. తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరు
పరచాలి. ఆ విషయం ఆయనతో చెప్పడానికి నాకు మనసొప్పటంలేదు. మీరే కాస్త సాయపడాలి"
అంటూ దీక్షితులు చేతులు పట్టుకున్నాడు ఎస్సై.
త్రుళ్ళిపడ్డాడు
దీక్షితులు. ఏమిటి బాబి జైలుకా? అంటూ రెండు చేతులతో కళ్ళుమూసుకున్నాడు.
"తప్పదుసార్!
ఇది నా ఉద్యోగ బాధ్యత, సహకరించాలి మీరు" అంటూ
దీక్షితులతో కలసి లోపలికి నడిచాదు ఎస్సై.
ఇప్పుడు కిట్టిగాడు పాలేరు
కొడుకు కాదు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి. వచ్చిన పని – “తనకి బిక్ష పెట్టిన దేవుడు
చేతికి సంకెళ్ళు వేయడానికి”. కిట్టిగాడి కళ్ళంట కన్నీళ్ళు ధారాపాతంగా
కారుతున్నాయి.
బాబికి సంగతంతా
అర్ధమైపోయింది.లోపలికి వచ్చిన ఎస్సైతో " ఎస్సై గారు, మీరు చేయాల్సిన పని మీరు
చేయండి. నా పూర్తి సహకారం నేను అందిస్తాను" అనేసరికి ఎస్సైతో బాటు దీక్షితులు
ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.
కిట్టిగాడు ఒకచేత్తో కళ్ళు
తుడుచుకుంటూ,
మరొకచేతిని బాబికి అందించి జీపులోకి ఎక్కించాడు.
ఊరు ఊరంతా కదలి వచ్చింది.
ప్రతి ఒక్క కన్ను తడిసింది.
సుగుణమ్మ ఒక్కసారి
కుప్పకూలిపోయింది.
"నువ్వు
ధైర్యంగా ఉండాలమ్మా! ఇప్పుడే లాయరు దగ్గరికి వెళతాను, బాబికి
ఎమీ కాదు" అని దీక్షితులు అంటుంటే, "నేనే ఆ పాపం
చేసాను గురువుగారు. ఆయన ఇవ్వనని చెబుతున్నా, నేనే పట్టుపట్టి
ఆ షెడ్డు నారాయుడికి ఇప్పించాను. నా మూలంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలసిపొయింది.
నిష్కారణంగా దేవుడిలాంటి ఆయనికి ఈ దుస్థితి" అని సుగుణమ్మ కొంగు నోట్లో
కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
ఆ మాటలు విని ఒక్కసారి
ఉలిక్కిపడ్డాడు దీక్షితులు. జీవితంలో మొట్టమొదటిసారి తన జోష్యం తప్పవ్వాలని బాబి
జాతకం చూశాకా కోరుకున్నాడు,
ఒకరకంగా మ్రొక్కుకున్నాడు.
తన కోరిక తీరలేదు కాని, బాబి జాతకం నిజమైంది -
"భార్య మూలంగా కారాగార జీవితం".
Friday, February 18, 2022
ఋణం
ఉదయం పేపరు చదివినప్పటినుంచీ సూర్యానికి కొంచెం దిగులు ఆవహించింది. ఆఫీసుకెళ్ళి పనిచేశాడన్నమాటేకానీ అన్నీ అసంపూర్తిగా వదిలేసి పెందరాళే ఇంటికొచ్చేశాడు. సూర్యం రాకని భార్య సమీర గమనించినా, గమనించనట్లే టీవి సీరియల్లో మునిగిపోయింది.
సూర్యం ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి ఒక కప్పు సమీరకిచ్చి (ఇది వెరైటీగా అనిపించిందా? అదంతే. పొరపాటున ఒకరోజు సూర్యం పెట్టిన కాఫీ తెగనచ్చేసి “నీ కాఫీ సూపర్ డియర్” అనగానే మన వాడి ఛాతి మోడీలా పొంగి, చేసిన ఆ పొరపాటు అలవాటుగా మారింది).
సోఫాలో కూర్చుని తాగుతుంటే ఎదురుగా టీపాయి మీదున్న పేపరు కనబడింది.అది చూడగానే సూర్యానికి మళ్ళీ ఒక్కసారి ఎక్కడో అసంతృప్తి. కారణం పేపర్లో వచ్చిన ప్రకటన – “కఛ్చపి కళావేదిక” వారు నిర్వహిస్తున్న "ఉగాది కధల పోటీ" - రచయతలకు ఆహ్వానం.
సూర్యంకి చిన్నప్పటినుంచీ కధలు చదవడమంటే పిచ్చి. ఉన్న ఊళ్ళోని అన్ని గ్రంధాలయాల్లోని వార, పక్ష, మాస పత్రికలన్నీ ఊదిపడేయటమే కాకుండా, కిళ్ళీకొట్లో దొరికే అపరాధ పరిశోధనలు, డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకి తెచ్చుకొని, కరెంటు లేకపోయినా కోడిగుడ్డు దీపం సహాయంతో పుస్తకాల పురుగులా రాత్రికి రాత్రే ఫినిష్ చేసినవి కోకొల్లలు.
ఆ రోజుల్లోంచే అతని మెదడులో ఒక కోరిక మొలకెత్తింది. అదేమిటంటే, తనుకూడా ఒక కధ రాయాలని, రచయత సూర్యం అనిపించుకోవాలని. ఎంతో ఆలోచించి, ఆవేశపడి రాసి పత్రికలకు పంపిన ఇంచుమించు ఒక అరడజను కధలు చాలా క్షేమంగా తిరుగు టపాలో ఇంటికి చేరాయి. ఇంక పెన్నుకి పని చెప్పి కాగితాలు వృధా చేయడం దండగ అని విరమించుకున్నాడన్నమాటే గాని, కోరికని మాత్రం చంపుకోలేదు.
చదువు, ఉద్యోగం, పెళ్ళి, సంసారం, పిల్లలు, వీటితోబాటొచ్చే వడిదుడుకులతో కధలు చదవడం క్రమేపీ తగ్గి, కధ రాయాలనే కోరికను వెనకసీట్లోకి నెట్టేశాయి.
కానీ కధ అచ్చవ్వలేదన్న బాధ మాత్రం ఇంకా అలాగే ఉంది. అంతే కాకుండా ఎప్పుడు కధల గురించి ప్రకటన చూసినా అదే అసంతృప్తి, ఏదో కోల్పోయానన్న భావం సూర్యాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. సూర్యం ఆఫీసుకి వెళ్ళే దారిలోనే ప్రఖ్యాత రచయత కోబ్రా ఇల్లు కూడా ఉంది.ఆ ఇంటిని చూసినప్పుడల్లా అతనిలోని కోరిక మరింత పెరుగుతూ వస్తోంది.
ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా సోఫాలోంచి లేచి పేపరు తీసుకొని చూసాడు, సరిగ్గా నెలరోజుల టైం ఉంది - కధ పోటీకి పంపడానికి, ఆలోచనంటూ వస్తే సరిగ్గా వారం చాలు అనుకుంటూ బెడ్ రూం లోకి నడిచాడు. కానీ ఈ పాతికేళ్ళనుండి ఏవో కధలు, సీరియళ్ళు అప్పుడప్పుడు చదవడమేగాని వాటి మీద ధ్యాస పెట్టి చదవలేదు. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ఎన్నో అద్భుతమైన రచనలు చేసి ఉంటారు, ఎన్నో క్రొత్త వొరవడులు వచ్చి ఉంటాయి - అవేవీ మనం చదవలేదే!
రాత్రంతా అవే ఆలోచనలు. ఎక్కడో చదివాడు, పెద్ద పెద్ద రచయతలందరూ మందు కొడుతూ, సిగరెట్లు కాలుస్తూ రచనలు చేస్తారని. కానీ తనకి ఆ రెండలవాట్లు లేవే? ఉండుంటే కనీసం ఆ ఆర్హతైనా వచ్చేదికదాని ఉస్సూరుమన్నాడు. సగం రాత్రి గడిచాకాగాని నిద్ర పట్టలేదు.
%%%
సూర్యం మర్నాడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిలో స్టేషనరీ షాపు దగ్గర స్కూటరు పార్క్ చేసి లోపలికి వెళ్ళి కొన్ని తెల్లకాగితాలు, బాల్ పెన్నులు కొనుక్కొని ఇంటికి చేరాడు. అప్పుడే సరిగ్గా కూతురు స్మితని స్కూల్నుండి తీసుకొని సమీర కూడా వచ్చింది.
"అన్ని తెల్లకాగితాలెందుకు, స్మితకి నోటుబుక్స్ కొనేశాం కదా!" అంది సమీర టేబుల్ పైనున్న పేపర్స్ చూసి. సమీర ప్రశ్నకి సమాధానం చెప్పకుండా లోపలకి వెళ్ళాడు సూర్యం.
"కధ రాస్తున్నట్లు సమీరకి చెప్పనా? వద్దులే! ఫస్టు కాపీ రాసి సర్ప్రైజ్ చేద్దాం " అనుకొని, అందరూ పడుకున్నారని నిర్ధారణ చేసుకున్నాకా మెల్లిగా తలుపు దగ్గరగా వేసి హాల్లోకి చేరాడు సూర్యం.
రాత్రి పన్నెండు దాటింది. హాల్లో టేబుల్ దగ్గర నుండి సోఫాలోకి, మళ్ళీ టేబుల్ దగ్గరికి మారుతూనే ఉన్నాడు ఎన్నెన్నో ఆలోచనలు. అసలు కధ దేని గురించి రాయాలి? ప్రేమ-త్యాగం, పగ - ప్రతీకారం, కుటుంబాలు - విలువలు. ఏది ఆలోచిస్తున్నా ఎక్కడో విన్నట్టో, చూసినట్టో అనిపించేదే. అర పేజీ రాయడం, అడ్డంగా కొట్టేసి ఆరుముక్కలు చేయడం. ఒక్కసారి జుట్టు గట్టిగా పీక్కొని అరవాలనిపించింది. కానీ పడగ్గదివైపు చూసి తమాయించుకున్నాడు. ఇక ఈరోజుకి లాభం లేదనుకొని పడక్కి దారితీసాడు.
సూర్యం లేచేసరికి బారెడు పొద్దెక్కింది. గబగబా బాత్రూంలో దూరి, కిచెన్ లోకెళ్ళేసరికి అప్పటికే కాఫీ కలిపేసిన ఛాయలు కనిపించాయి. ఓహో! తను తాగేసిందన్నమాట అనుకొని, ఫిల్టరులో మిగిలిన డీకాషనుతో కాఫీ కలుపుకొని హాల్లోకి నడిచాడు.
సమీర ముభావంగా టీపాయి మీద కూరలు తరుగుతోంది. సూర్యం పేపరు తీసుకొని,"నన్ను లేపాల్సింది సమీ, బాగా లేట్ అయిపోయింది" అంటూ పలకరించాడు. సమీర సమాధానం చెప్పకుండా అక్కడినుంచి లేచి కిచెన్ లోనికి వెళ్ళిపొయింది. ఏమిటి అంత మూడీగా ఉంది? ఏమై ఉంటుందబ్బా? బహుశా రాత్రి తనతో కబుర్లు చెప్పకుండా బాగా లేట్ గా పడుకున్నాననేమో!
"సమీ! రాత్రి కొంచెం ఆఫీసు పని చేసుకోవాల్సి వచ్చింది" అంటూ దగ్గరకు రాబోతున్న సూర్యాన్ని తప్పించుకొని విసవిసా బయటికి వెళ్ళిపొయింది సమీర.
సూర్యానికి అసలు సమీర అలక ఎందుకో అర్ధం కావడంలేదు. ఒక్కసారి తేదీలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. సమీర పుట్టిన రోజు లేదా పెళ్ళిరోజు. తన పుట్టినరోజు మరచిపోయి విష్ చేయని రోజున సమీర పెట్టిన పెంట అంతా ఇంతా కాదు. కానీ ఈరోజు ఆ రెండూ కావే! ఏమై ఉంటుందబ్బా? అనే ఆలోచనలతోటే ఆ రోజు శనివారం కూడా కావడంతో ఇంట్లోనే గడుపుతున్నాడు. ఎలాగైనా సరే కధ కోసం ఈ రోజంతా కూర్చోవాలి అనుకున్న సూర్యానికి, సమీర కధే అంతుపట్టటం లేదు. సాయంత్రందాకా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఇక లాభంలేదనుకొని ఎప్పటిలాగే బతిమాలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
కాసేపటికి సమీర నోరు విప్పి కొపంగా "ఎంతకాలం నుంచి సాగుతోంది? ఇంత అమాయకంగా కనిపిస్తావు. పెళ్ళయి పదేళ్ళవుతోంది. ఆరేళ్ళ కూతురు కూడాను, ఇప్పుడు నీకు ఆ పనులు చేయడానికి సిగ్గనిపించడంలేదా? అసలు నీకు నేనేమి అన్యాయం చేసాను? ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు ఆఫీసుపనని అబద్ధాలు కూడాను" అంటూ రోజూ టీవి సీరియల్లో వినపడే డైలాగులన్నీ గుక్కతిప్పుకోకుండా సింగిల్ టేక్ లో చెప్పేసరికి, సూర్యానికి అది కలో నిజమో కంఫ్యూజయ్యి ఒక్కసారి చేతిని గిల్లి చూసుకొని నిజమే అనుకున్నాకా,
"సమీ! రాత్రేమైనా పీడకలొచ్చిందా? అంతల్లా టీవీ సీరియల్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పానా" అని సూర్యం పూర్తి చేసేలోగా," "ఆపు! నన్ను చెప్పనీయ్" అని పెద్దగా అరుస్తూ,
"నంగనాచిలా మాట్లాడకు! ఎవత్తది? ఎంతకాలం నుండి సాగుతోంది? ఏవిటీ! బాపూ గీసిన బొమ్మలా ఉందా? దాని కళ్ళు అరవిరిసిన మందారమా? దానిది పిట్ట నడుమా! ఈరొజు నేను కట్టిన చీర రేపటికి నీకు గుర్తుండదు కాని, ఆహాహ! అది ఎప్పుడో ఫ్యాషన్ షో లో కట్టిన చీర మాత్రం నీకంటిముందు తెరచాపలా ఎగురుతోందా! అబ్బబ్బబ్బబ్బ! ఏమేమి వర్ణనలు? సిగ్గులేకపోతే సరి. ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే" అని చివాలున లేచి బెడ్రూములోకి పరుగుదీసింది.
అవునూ! ఈ డైలాగులెక్కడో విన్నట్లుందే అని సూర్యం ఆలోచించేలోగా సమీర గుప్పిట్లో కొన్ని కాగితం ముక్కల్ని తీసుకొచ్చి టీపాయిపై పడేసింది. అవి చూడగానే సూర్యానికి ఒక్కసారి రాత్రి తన కధా ప్రయత్నం గుర్తుకొచ్చి దానితోపాటు ఆ ప్రయత్నానికి బలియైపోయిన తెల్ల కాగితాలు, అవి ఎలా సమీర కంటబడ్డాయో తన డిటెక్టివ్ బుర్రతో పసిగట్టి, కధని చెప్పకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చేద్దామనుకుంటే, తన కేరక్టర్ నే సస్పెక్ట్ చేసేలా చేసుకున్నానే! ఇప్పుడు ఎలా నిజం చెప్పాలి? చెబితే నమ్ముతుందా లేదా ఇంకా పెద్ద ఇష్యూ చేస్తుందా?
ఇంక ఆగలేక సమీర చేయి పట్టుకొని బలవంతంగా ప్రక్కన కూర్చోపెట్టుకొని మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అది సరిపోక కూతురుపై ఒట్టు వేసాకా గాని సమీర శాంతించలేదు.
%%%
ఇలా ప్రతిరోజూ అర్ధరాత్రి దాకా పేజీలకు పేజీలు రాయడం ఎక్కడో అసంతృప్తిగా అనిపించడం, చింపేయడం - దినచర్య అయిపోయింది సూర్యానికి.
అసలు ఇన్నేసి కధలు జనాలందరు ఎలా రాసేస్తున్నారు? మొన్ననే రచయత కోబ్రా కి ఒక సంవత్సరంలో వంద కధలు ప్రచురణ పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున సన్మానం చేసారు. తను ఆఫ్ట్రాల్ ఒక కధ రాయడానికే ఇంత కష్టపడుతున్నానేమిటి? అని నిరాశ, నిస్పృహ అలముకున్నాయి సూర్యానికి. కానీ అంతలోనే రచయత కోబ్రా ఎదో ఒక ఇంటర్వ్యులో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆయన క్రొత్తలో వ్రాసిన ఎన్నో కధలు తిరుగు టపాలో దర్శనమిచ్చాయని అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా రాయడం మానలేదని. ఆ మాట మంచి టానిక్ లా పనిచేసింది. “ఇంక సమయం లేదు మిత్రమా!” అనుకొని కధ మీద దృష్టి పెట్టాలనుకొని ఒక నిశ్చయానికొచ్చాడు.
రోజూ ఆఫీసు నుండి తొందరగా ఇంటికొచ్చేయడం, ఫ్లాస్కు నిండా టీ పెట్టుకొని అర్ధరాత్రి దాకా కధతో కుస్తీ పట్టడం చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఒక సుముహూర్తానికి ఒక ప్లాటు దొరకడంతో, కలాన్ని వేగంగా పరిగెత్తించి తెల్లారే దాకా రాసాడు. రాసింది ఒకటికి పది సార్లు చదువుకున్నాడు. కధ బాగానే వచ్చిందనుకొని చిన్న చిరునవ్వు వదిలాడు. మర్నాడే సమీరకి వినిపిద్దాం అనుకుంటూ అక్కడే సోఫాలో పడుకున్నాడు.
ప్రొదున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, "సమీ డార్లింగ్! కధ రెడీ" అని చాలా ఉత్సాహంగా సూర్యం చెబుతుంటే, "అవునా" అంటూ ఆశ్చర్యంగా చూసింది సమీర. అవునని
విజయగర్వంతో తలవూపుతూ "సాయంత్రం తమరికి వినిపిస్తాను. నా కధకి మొదటి శ్రోత నువ్వే" అని బుగ్గమీద చిటిక వేసి ఆఫీసుకి బయలుదేరాడు సూర్యం. ఎప్పుడు ఆఫీసవుతుందాని టైము చూస్తూనే ఉన్నాడు.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి ఒకటి సమీరకిచ్చి ఎదురుగుండా కూర్చొని, రాత్రి రాసిన కధ పేపర్లు తీసుకొని చదవడం ప్రారంభించాడు సూర్యం.
"ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక అమ్మాయి పరిచయం అవడం, అనుకోకుండా ఆమెతోనే పెళ్లి కుదరడం జరుగుతాయి. కానీ అనూహ్యంగా అతను పెళ్లికి ముందు ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. తాను చేయని ఒక హై ప్రొఫైల్ హత్యలో బలవంతంగా ఇరికించబడతాడు” అంటూ, కధ చెప్పడం ప్రారంభించాడు.
కధ సగం అవకుండానే, " ఇక ఆపేయ్" అని ఒక్క కేక వేసింది సమీర. అనుకోని ఆ పరిణామానికి సూర్యం ఒక్క సారి ఉలిక్కిపడేసరికి చేతిలోనున్న కాగితాలన్ని కింద పడిపోయాయి.
"ఏమైంది సమీ! అల్లా అరిచావు?" అని అమాయకంగా అడిగాడు సూర్యం.
"అరవక మరేంచెయ్యాలి? సినిమా కధ చెప్పేస్తుంటే, వింటూ ఊ కొట్టాలా? " అంది సమీర.
"సినిమా కధేవిటే? రాత్రంతా నిద్దర ఆపుకొని మరీ రాసిన కధ ఇది" అని కొంత ఉక్రోషంగా అన్నాడు సూర్యం.
"ఇంక కట్టేయ్ దుకాణం, క్రితం నెల్లో రిలీజయిన సినిమా కధ ఇదే. నీకు కాఫీ తో బాటు కాపీ కొట్టడం కూడా బాగా వచ్చన్నమాట " అని మొత్తం కధనంతా వినిపించేసరికి సూర్యం ముఖంలో నెత్తురు చుక్కలేదు. సేం టు సేం - మొత్తం తను రాసిన కధే.
"నన్ను నమ్ము సమీ! నేను సినిమాలు చూడనని నీకు తెలుసుకదా! అదే ఆలోచన నాకెందుకు రాకూడదు?" రెట్టించి అడిగాడు సూర్యం.
"ఆ విషయం నాకు తెలుసు. కానీ బయటివాళ్ళకు తెలియదు కదా? బ్రహ్మండంగా కాపీ కొట్టావనుకుంటారు. ఇంకా నయం నాకు చెప్పావు గాబట్టి సరిపోయింది" అని కొంచెం కోపంతో బాటు వెటకారం కలిపి మిక్సడ్ ఫీలింగ్ వదిలేసరికి, చేతిలోనున్న్ కాగితాలని డస్ట్ బిన్ లో పడేసి మంచమెక్కేసాడు సూర్యం.
%%%
కధ పంపడానికి సరిగ్గా వారం సమయం మాత్రమే ఉంది. పట్టువదలని విక్రమార్కుడిలా సూర్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టడంతో రాయడానికి ఉపక్రమించి ఎందుకేనా మంచిదని ఆమర్నాడు ఆఫీసుకి సెలవు మెసేజ్ పంపించాడు. కధ ఒక కొలిక్కి వచ్చింది. మధ్యాహ్నం టీవీ ముందు కూర్చున్న సమీరని పిలిచి నువ్వు ఖాళీగా ఉంటే కధ వినిపిస్తానని చెబితే, ఇంకా రెండు సీరియల్స్ ఉన్నాయి ముందు అవి అవ్వాలని నిర్మొహమాటంగా చెప్పేసింది.
సమీర సాయింత్రం అవుతుండగా సూర్యం ఎదురుగా కూర్చొని "ఇప్పుడు చెప్పు వింటా" అంది.
అడగడమే తడవుగా వెంటనే మొదలు పెట్టేశాడు సూర్యం. తను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమీర నుంచి మాత్రం ఏ ప్రతిస్పందన లేదు, కళ్ళు మూసుకొని వినడం తప్ప. చెప్పటం పూర్తయి సమీర మొహం కేసి చూసాడు. ఇంకా కళ్ళుమూసు కొనే ఉంది. ఒక నిమిషం తరువాత కళ్ళు తెరచి ఇప్పుడు చెప్పనా అన్నట్లు సూర్యం వైపు చూస్తూ.
"నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పటినుంచో అనేక రకాలైన రచనలు చదివే ఉంటావు కదా! అందులోఎందరో ప్రముఖలు రాసినవి ఉండచ్చుగదా! కనీసం ఒక్కరైనా హింసని ప్రేరేపించేలా రచనలు చేసారా? “అని సమీర స్కూల్ టీచరు పిల్లలనడిగినట్లు అడుగుతుంటే,
“తను ఒక రచన చేసాడా లేక ఏదైనా దొంగతనం చేసాడా” అని తనమీద తానే అనుమానపడ్డాడు సూర్యం.
“అదికాదు సమీ ఇది ఇప్పుడున్న సొసైటీలో జరిగేదే కదా” అనే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే,
"కిందటేడు బెంగులూరు లో ఏం జరిగిందో మరచిపోయావా" అని సమీర గద్దించినట్లు అడిగింది.
అప్పుడు సూర్యానికి వెలిగింది. నిజమే "ఒక రచన ఒక మతంవారి మనోభావా లను దెబ్బతీసాయని, ఆ రచయతను పొట్టను పెట్టుకున్న సంఘటన" తన కళ్ళ ముందు మెదిలి, ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. తొలిసారి నిజంగా భయమేసింది. ఇంక మారు మాట్లాడకుండా ఆ కధని ముక్కలు ముక్కలుగా చింపి డస్ట్ బిన్ లో పడవేయబోతూ, ఆగి కిచెన్లోకి వెళ్ళి గాస్ స్టౌ వెలిగించి అవన్ని పూర్తిగా కాల్చేసాడు.
%%%
ఆరోజు స్మిత స్కూల్ యానివర్సరి. స్మిత ఒక డ్యాన్స్ ప్రొగ్రాం లో చేస్తొంది.
సాయంత్రం అందరూ కలసి స్కూల్ కి వెళ్ళారు. స్మిత ప్రొగ్రాం ముందుగానే అయి పోయింది. తరవాత ఇంకా నాటికలు, పాటల కార్యక్రమాలు ఉన్నట్లున్నాయి.
ఇంతలో సూర్యం మెల్లిగా సమీర చెవిలో "సమీ! నాకు తలపోటు విపరీతంగా వస్తోంది. ఇంటికెళ్ళిపోతాను, మీరు అన్నీ చూసిరండి" అని చెప్పి ఇంటికొచ్చేశాడు. నిజానికి సూర్యానికి తలపోటేమీ రాలేదు. కధ పంపడానికి ఇంక రెండురోజులు మాత్రమే టైం ఉంది. అతని ధ్యాస అంతా దానిమీదే ఉండటంతో తలపోటు వంకతో ఇంటికొచ్చి, కధ మీద పడ్డాడు.
రాత్రి పదవుతుండగా సమీర, స్మిత ఇంటికొచ్చారు. వస్తూనే సూర్యాన్ని చూసి తలపోటు తగ్గిందా అన్న సమీర ప్రశ్నకు సూర్యం తలూపుతూ రచనలో నిమగ్న మైపోయాడు.
స్మితని పడుకో బెట్టి, సూర్యానికి ఎదురుగా కూర్చుని, అతను వీళ్ళని వదిలి మధ్యలో స్కూల్ నుండి వెళ్ళిపోయాకా జరిగిన కార్యక్రమాల గురించి చెబుతొంది సమీర. సూర్యం ఊ కొడుతున్నాడు కాని అతని ధ్యాస కధపైనే ఉంది.
"ఫిఫ్త్ గ్రేడు పిల్లలు నాటిక వేశారు సూర్యం. ఎంతబాగుందనుకున్నావు? స్నేహం గురించి మంచి మెసేజ్ ఇచ్చారు" అని ఆ నాటిక కధ చెప్పసాగింది. మొదట అంతగా వినిపించుకోని సూర్యానికి నలుగైదు లైన్లు వినగానే ఒక్కసారి గతుక్కుమని ఎటెన్సన్ లోకి వచ్చాడు.
"సమీ! నువ్వు నిజంగా ఆ నాటకం కధే చెబుతున్నావా?" అని సమీర కళ్లల్లోకి చూస్తూ అడిగాడు.
"అవును ఆ కధే! నీకెందుకు డౌటు?" అని సమీర మళ్ళీ కధ కొనసాగిస్తుంటే,
ఒక్కసారి సూర్యం "ఆగు! ఆ ఫ్రెండుకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా? ఇంకో ఫ్రెండు దానం చెయ్యడానికి ముందుకొచ్చాడా?"
"అవును సూర్యం! అంత కరక్ట్ గా ఎలా గెస్ చేసావు" అని సమీర అడ గడంతోనే, "ఇలా" అని సూర్యం రాసుకున్న మొత్తం కధ చదివేసరికి, సమీరకి అనుమానం వచ్చింది - ఈ నాటిక చూసే సూర్యం ఇంటికెళ్ళడేమోనని.
ఆ మాటే సూర్యాన్ని అడుగుదామని అనుకొనేసరికి, సూర్యం కాగితాలను సమీర వొళ్ళో పడేసి, రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ ఆఫీస్ రూంలోకి వెళ్ళి తలుపేసుకొని కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి రచయత కోబ్రా గుర్తుకువచ్చారు.ఇంతకు ముందు రెండు మూడు సార్లు ఆయన్ని కలవడం జరిగింది. వయసు ఎనభైకి దగ్గర పడుతున్నా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కబుర్లు చెప్పారు. ఆయన్ని వెళ్ళి కలిసి నా ప్రయత్నాలను ఏకరవు పెడితే ఎలా ఉంటుంది? ఏదైనా సలహా ఇస్తారేమో! పోనీ కొన్ని రోజులు ఆయన వద్ద పనిచేస్తే మెళులువలు తెలుస్తాయేమో! ఒప్పుకుంటారా? ఇలా పరిపరివిధాలుగా సూర్యం ఆలోచనలు సాగాయి. చివరికి ఆయన్ని వెళ్ళి కలవడానికే నిశ్చయించుకున్నాడు. ఆదివారం రోజున ఎప్పుడూ ఆలస్యంగా లేచే సూర్యం,ఆ రోజు ఆదివారమైనా చాలా తొందరగానే లేచి, తయారయ్యి కోబ్రా గారింటికి బయలుదేరాడు.
తలుపు కొట్టగానే, కోబ్రా గారి భార్య వచ్చి సూర్యాన్ని గుర్తుపట్టి, భర్తని కలవడానికి వచ్చాడని ఊహించుకుని, ప్రక్క గదిలోకి వెళ్ళమంటూ దారి చూపించింది.
గదిలోకి ప్రవేశించిన సూర్యం ఒక్కసారి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. నాలుగు గోడలకి పెద్ద పెద్ద అలమైరాలు. వాటినిండా పుస్తకాలు, అవే కాకుండా రెండు టేబుళ్ళ మీద కూడా పుస్తకాలు. అదొక పెద్ద గ్రంధాలయంలా ఉంది. కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న కోబ్రా గారు సూర్యం రాకని గమనించి, కూర్చోమన్నట్లు ఎదురుకుండా ఉన్న కుర్చీని చూపించారు. అంతకుముందే తెలిసి ఉండటంతో కుశల ప్రశ్నలు అయ్యాక, కోబ్రా గారు సిగరెట్ వెలిగించి, ఒక్కసారి దమ్ముపీల్చి, సంభాషణ మొదలుపెట్టారు,
"ఎలా ఉన్నావు సూర్యం, ఏమిటీ ముఖం అలా పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నావు?
"ఏం చెప్పమంటారు సార్? ఇదీ విషయం" అంటూ తన కధా నిర్మాణ ప్రోజెక్ట్ గురించి పూర్తిగా ఏకరువు పెట్టాడు సూర్యం.
కోబ్రా గారు ఒక్కసారి తల పంకించి "చూడు సూర్యం! కధ రాయాలనే నీ తపన ఉంది చూదు, అది హర్షింపతగ్గదే, కానీ పేపర్లో అచ్చవ్వాలనో లేదా బహుమతి పొందాలనో ఆశ ఉంది చూశావూ, అది మాత్రం దురాశేనయ్యా?" అన్నారు.
ఆమాటలకి సూర్యం ఒక్కసారి ఉలిక్కిపడి "అదేంటి సార్ అంత మాటనేసారు?" అన్నాడు విచారంగా మొహం పెట్టి.
కోబ్రా గారు ఒక్కసారి సూటిగా చూస్తూ "అవునయ్యా! నువ్వే చెప్పావు కదా తెలుగు సాహిత్యం పాతిక సంవత్సరాలనుండి అప్పుడప్పుడు చదువుతున్నానని " అన్నారు.
"అవునండి! ఇంచుమించు అంతే" అంటూ నసిగాడు సూర్యం.
"పోనీ అంతే అనుకుందాం! నీకు గుర్తున్న రచనలు గానీ, రచయతల పేర్లు గాని కొన్ని చెప్పు" అడిగారు కోబ్రా గారు.
ఒక్కసారి బుర్ర గిర్రున తిరిగింది సూర్యానికి.
"అమ్మో! ఈ బౌన్సర్ ఏమిటి నాకు" అని లోపల అనుకోబోయి, యధాలాపంగా పైకి అనేశాడు.
కోబ్రా గారు చిద్విలాసంతో సూర్యాన్నే చూస్తున్నారు "ఏం చెబుతావన్నట్లు".
కొంచెం సేపు గింజుకొని కొంతమంది పేర్లు చెప్పి, ఆయన వైపు ఏదో తప్పుచేసినట్లు చూసాడు.
"నువ్వు నిజంగానే అత్యంత దురాశపరుడవు సూర్యం" అని నిష్కర్షగా కోబ్రా గారు అనటంతో, ఒక్కసారి సూర్యం ముఖం పాలిపోయింది.
"నా దురాశ ఏమిటండి?" అమాయకంగా అడిగాడు సూర్యం.
"కాదా మరి! నీ నోట విన్న పేర్లలో ఒక్కటి కూడా నా మస్తిష్కంలో మెదలడం లేదంటే, వాటి ప్రాచుర్యం ఏమిటో తెలుస్తొంది కదా! నీ తటపాయింపే చెబుతోoది" అవి మఖలో పుట్టి పుబ్బలో మసకబారే రచనలే అని".
“మన తెలుగు భాషలో ఎందరో మహానుభావులు ఎన్నో అద్భుతమైన రచనలను ఆవిష్కరించారు. రకరకాలైన ప్రయోగాలు చేసి వాటి ద్వారా సంఘంలో పరివర్తనకి కారణభూతులయ్యారు. ఎందరికో ఆరాధ్యులయ్యారు. చాలా మంది రచనలే వారి ఇంటిపేర్లుగా స్థిరపడ్డాయంటే వాటి స్థాయి ఊహించుకోవచ్చు. నువ్వు చెప్పినవాటిలో కనీసం అటువంటి పేరు కూడా నీ నోటినుండి నేను వినలేదు. అంటే, నువ్వు వాటిని చదవలేదన్నమాటేగా!” అంటూ అనుమానాస్పదంగా చూసారు సూర్యం వైపు.
“అవునూ కాదన్నట్లుగా” తలూపాడు సూర్యం.
“కానీ నువ్వు నాలుగు రోజులు నిద్రమానేసి, ఏవేవో కాగితం మీద పెట్టేసి రాసిన కధ మాత్రం అచ్చైపోవాలి! అందరూ చదివేయాలి, ఇది దురాశ కాదంటావా సూర్యం?” సూటిగానే అడిగారు కోబ్రా గారు.
“కధలు రాస్తే పేరు వస్తుందనుకుంటే, అందరూ అదేపనిలో ఉంటారు. కానీ రాసిన కధ పేరు తేవాలి. అది రచయతకు ఒక ఉత్ప్రేరకంలా పనిచేసి మరింత ఉత్సాహంతో ఎన్నో ప్రయోగాలు చేయాలనిపిస్తుంది”.
సూర్యం ‘ఊ’ కొట్టడం కూడా చేయకుండా స్థాణువై వింటూనే ఉన్నాడు.
కోబ్రా గారు మాత్రం ఇలా చెప్పుకుంటూ పోతున్నారు….
“సాధారణంగా రచయత స్వానుభవం లేదా తను చూసిన, తెలిసిన జీవితాలలో జరిగే నిజ సంఘటనలే ఇంచుమించు కాస్త అటూ ఇటూగా కధావస్తువులవుతాయి. ఏ సంఘటన రచయిత హృదయాన్ని కదిలించి రసస్పందన కలిగిస్తుందో అది అద్భుత మైన కధాశిల్పానికి మూలం అవుతుంది. అష్టవంకర్లున్న రాతి దిమ్మని శిల్పి నైపుణ్యం ఎంత అందమైన శిల్పంగా మారుస్తుందో అలాగే ఒక కధావస్తువు కూడా రచయత ఆలోచనని బట్టి ఒక అద్భుతమైన రచనగా మలచబడుతుంది. ఇంకో విషయం చెప్పనా? పాటలు బాగా పాడే వాళ్ళకి సంగీతం రానవసరం లేదు. కానీ ఇలాంటి వెసులుబాటు కథల విషయంలో లేదు నాయినా! కథలు బాగా రాయాలనుకొనే రచయితలకు కథాశిల్పం గురించి తప్పకుండా తెలియాలి”
"శిల్పాలు తెలుసుగాని, కధాశిల్పం ఏమిటి సార్? ఎప్పుడూ వినలేదు" అమాయకంగా అడిగాడు సూర్యం.
తప్పకుండా చెబుతాను “కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం అంటే! కథా శిల్పం అర్ధం చేసుకోటానికి తేలిక పద్ధతి ఒకటి ఉంది. అది ప్రముఖులు రాసిన కథల్ని మంచి విమర్శకులు చేసే విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవడం.
అలాగే తెలుగులో మొదటి తరం రచయితలుగా ప్రముఖులైన రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, బుచ్చిబాబు, శ్రీపాద, చాసో, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు మొదలైన వారి కథలను చదివితే, కధా శిల్పం అన్నది అవగాహనకు వస్తుంది. ఇక ముళ్ళపూడి విషయానికొస్తే, బాపూ గీసిన బొమ్మలే ఎన్నో కధలకు వస్తువులయ్యాయి.
అంతే కాకుండా ఇక్కడ నీకింకో విషయం చెప్పాలి, శ్రీపాద వారు "అనుభవాలు జ్ణాపకాలున్నూ" లో చెప్పినట్ట్లు పూర్వపు రచయతలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు వ్రాసిన కధలకు లేదా నవలలకు ఎన్ని ప్రతులు కావలసినా, అన్నీ చేతితో వ్రాయడమే. కాలి నడకన వెళ్ళి అందరికీ పంచిరావడమే. ఇప్పటి సౌకర్యాలు వారెకెక్కడ? కొంతకాలానికి అచ్చేసే రోజులొచ్చినా, డబ్బేదీ? దానికీ పరాధీనమే. ఎవరో అన్నట్లు, రచయత తన డబ్బుతో తాను అచ్చువేసుకుంటే అంతకంటే హీనం లేదు. ఒక దశాబ్దం క్రిందటి వరకూ పాఠకులు ముద్రణా సంస్థలతోపాటు రచయతలందరినీ అందలమెక్కించారు. పత్రికలన్నీ పోటీపడి కధలను ప్రచురించి రచయతలను ప్రొత్సహించారు.
ఇప్పుడు చూస్తుంటే అవన్నీ గత వైభవాలుగా మిగిలాయి. అనేక పత్రికలు మూలపడ్డాయి. కారణాలు అనేకం. వాటిని చర్చిస్తూ సమయం వృధా చేయడం కన్నా,తక్షణ కర్తవ్యం ఏమిటంటే “పుస్తకపఠనం” పెరిగేలా చేయాలి. ముఖ్యంగా యువతలో ఆ చైతన్యం తీసుకురావాలి. అప్పుడే రచయతలకు తిరిగి మంచి రోజులొస్తాయి. నిన్ను బోరు కొట్టించకుండా ఇంకో చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. పూర్వం ఆంగ్ల దేశంలో జనాలు పుస్తకం ఒక్కొక్క పేజీ చదవగానే చింపేసేవారట. ఎందుకంటే పునఃముద్రణలు జరిగి రచయతలు, పబ్లిషర్లు బ్రతుకుతారని. మనం అంత త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, ఎంతో సమయం వెచ్చించి, అనేక కష్టాలతో సహవాసం చేసి, కూర్చి, అద్భుతమైన కధలను ఆవిష్కరించిన మహోన్నతులు ప్రస్తుతం మనమధ్య లేరు. కానీ వారు విడిచి వెళ్ళిన అత్యంత విలువైన సాహితీ సంపద ఇబ్బడిముబ్బడిగా ఉంది. ఆ అపూర్వ సాహిత్యాన్ని మనం చదివి పదిమంది చేత చదివించడం బాధ్యత మాత్రమే కాదు కర్తవ్యం కూడాను. ఇదే మనం వారి కిచ్చే నివాళి. ఈ విధంగానైన ఎంతో కొంత వారి ఋణాన్ని తీర్చుకుంటున్నామనే తృప్తి. ఉంటాను” అంటూ కళ్ళజోడు టేబుల్ పైన పెట్టి, అర్ధమైందా అన్నట్లు సూర్యం కేసి చూసారు.
సూర్యం మొహం పాలిపోయింది. కానీ ఎంత నగ్నసత్యం చెప్పారు పెద్దాయన. కొరడాతో కొట్టినట్లైంది ఆ మాటలకి, సిగ్గుతో కుచించుకుపోయాడు తన కోరికను తల్చుకుని. ఒక్కసారి తనలో గూడుకట్టుకున్న అసంతృప్తి, దూదిపింజలా బయటికి ఎగిరిపొయింది. దాని స్థానంలో ‘నేను చదవాలి పదిమంది చేత చదివించాలి’ అన్న ధృఢ సంకల్పం మనస్సునిండా ఆవహించింది. లేచి కోబ్రా గారికి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంటివైపు నడిచాడు.
మరునాటినుండే సూర్యం దినచర్యలలో ‘ఋణం’ తీర్చుకొనే భాగం (బాధ్యత) గా ‘పుస్తకపఠనం’ ఒక క్రమం తప్పనిదైంది.
నేను తప్పుచేశానంటావా?
నేను తప్పుచేశానంటావా?
- శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ
"దివా!
టైం ఎనిమిదవుతోంది. లేచి స్నానం చేయాలి. ఇంకో అరగంటలో కుళాయి కట్టెస్తారుట"
అన్న భార్య మాటలకి మెలుకువొచ్చింది దివాకరానికి.
అబ్బా!
ఇక్కడకూడా పడుకోనీయవా అంటూ బద్ధకంగానే లేచి బాత్రూంకి దారితీశాడు.
అంతకుముందు రోజే
అమెరికా నుండి ఇద్దరు
పిల్లలను తీసుకొని రెండువారాలు ఇండియాలో గడపటానికొచ్చారు దివాకరం, నీలిమ.
రాజమండ్రి పట్టణాన్ని ఆనుకొని గోదావరి ఉన్నా
వేశవి కాలం కావడంతో సగానికిపైగా ఎండిపోవడంతో నీటికుళాయి సరఫరాను ప్రొద్దున్న సాయింత్రాలకు గంట
చొప్పున పరిమితం చేశారు.
వీలైనంతవరకు కుటుంబం మొత్తం
కుళాయి వెళ్ళేలొపులో నీళ్ళకార్యక్రమాలు కానిచ్చేసి, మిగతా
నీటిని రెండు పెద్ద
గుండిగలతో పట్టుకొని సాయింత్రం కుళాయి
కోసం వేచిచూడడమన్నది పట్టణవాసుల దినచర్యలలో ఒక
ప్రధానభాగమైపోయింది.
దివాకరం స్నానం
చేసి హాల్లో కూర్చొని పేపర్
తిరగేస్తున్నాడు.
"టిఫిన్
తేవడానికి నాన్న హొటెల్
కి వెళ్ళారు. ఈలోపు
కాఫీ తాగుతావా" అడిగింది నీలిమ.
" అలాగే, పిల్లలింకా లేవలేదా? రాత్రి
బాగా లేటుగా పడుకున్నారనుకుంటా" అంటూ నీలిమతోబాటు కిచెన్
లోకి నడిచాడు దివాకరం.
"బాగా
నిద్రబట్టిందా
బాబూ" అని దివాకరాన్ని పలకరిస్తూ, "పాలు స్టౌ
మీద పెట్టాను, ఫిల్టరులో డికాషను దిగే
ఉంటుంది చూడు" అని కూతురికి పురమాయిస్తూ పెరట్లోకి దారితీసింది నీలిమ
తల్లి.
రెండు స్టీలు
గ్లాసుల్లో కాఫీ పోసి
ఒకటి దివాకరానికిచ్చి, "నడు హాల్లో
కూర్చొని తాగుదాం" అంది నీలిమ.
"ఈరొజు
కార్యక్రమం ఏమిటి?" అన్నాడు మెల్లిగా కాఫీ
సిప్ చేస్తూ.
"నువ్వేవో బట్టలు
కొనాలన్నావు కదా? ఒకవేళ
రెడీమేడ్ కాకపోతే, కుట్టివ్వడానికి టైం
పడుతుంది" అంది నీలిమ.
" అవును కదా!
అయితే ఈరోజే వెళదాం
పద" అన్నాడు దివాకరం.
ఉదయం పదకొండుకే సూర్యుడు తన
ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దివాకరం, నీలిమ
షాపింగుకి బయలుదేరారు ఆటొలో.
కొటగుమ్మం
గాంధీ బొమ్మదగ్గర ఆటో దిగి బట్టల కొట్టులు చూసుకుంటూ నడుస్తున్నారిద్దరూ. దాదాపు
ఇరవై ఏళ్ళుగావస్తోంది రాజమండ్రి వదలి. ఊరు బాగా పెరిగిపొయింది. ఆటోలు మొటారు
సైకిళ్ళు విపరీతమైపోయాయి. అసలే ఇరుకుసందు, ఆటోలు పోనివ్వరు కాబట్టి మోటారు సైకిల్
పై కుటుంబం మొత్తాన్ని ఎక్కించుకొని అడ్డంగా నడుస్తున్న జనాలను చాకచక్యంగా
తప్పించుకొని వెళ్ళేవిధానం చూస్తుంటే ఇద్దరికీ ఆశ్చర్యంగాఉంది. ఆవీధొక చిన్న
ప్రపంచం. అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. ముఖ్యంగా నల్లమందు వీధి, గుండువారి వీధి
చాలా ప్రశిద్ధి. నాలుగడుగులు వేసారో లేదో ఒకటే ఉక్కబోత. ధారాళంగా చమటలు
పడుతున్నాయి దివాకరానికి.
"
అబ్బా! నావల్లకాదు! ఎదోఒక షాపులోకెళదాం
పద!" అని దివాకరం అనగానే, సరేఅని అతనితోపాటు ఎదురు గుండా కనిపిస్తున్న
మూడంతస్తుల బట్టల షాపులోకి నడిచింది నీలిమ.
లోపలికి అడుగుపట్టగానే ఏసి
చల్లదనానికి ఒక్కసారి ప్రాణం
లేచొచ్చినట్లయింది.
ఒకనలుగురైదుగురు
చుట్టూమూగి ఏం కొనాలనుకుంటున్నానో అడిగి
మగాళ్ళ సెక్షన్ కి
తీసుకుపోయారు. ప్యాంటు చొక్కాల తాన్లు
షెల్ఫుల నిండానే కాకుండా నేలమీదకూడా గుట్టలుగుట్టలుగా పడిఉన్నాయి. చాలా
కంఫ్యూజన్ లో పడిపోయాడు దివాకరం. ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారికూడా తనబట్టలు తను
కొనుక్కోలేదు. ఎప్పుడూ భార్య
కొని పట్టుకొచ్చినవి కట్టుకోవడమే. ఏం
కొనాలో అర్ధం కావడంలేదు. అందరూ
తననే చూస్తున్నారు. కొంత
ఇబ్బందిగా అనిపించింది.
"నావల్ల
కాదుగానీ, నువ్వే కానిచ్చేసేయ్" అని నీలిమకి ఒక
హింటిచ్చాడు దివాకరం.
భార్య చూపించినవాటికి తలూపుతూ మొత్తానికి ఒక
అరడజను జతలు తీసుకొని క్యాష్
కౌంటర్ దగ్గరికి వెళ్ళి
క్రెడిట్ కార్డిస్తూ "ఇక్కడెవరైనా బాగా
కుట్టే టైలర్ ఉన్నడా"
అని అడిగాడు.
“ప్రక్కనే గుండువారి సందులో
టైలర్ ఖాదిర్ అని
ఉన్నాడండి, బాగా కుడతాడు" అని అక్కడికి ఎలా
వెళ్ళాలో చెప్పాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి.
" దివా! నేను
చీరలు చూస్తూఉంటాను, నువ్వెళ్ళొచ్చేయ్" అని నీలిమ
చీరల సెక్షన్ లోకి
నడిచింది.
బిల్లు చెల్లించి టైలర్
షాపుకి బయలుదేరాడు దివాకరం. అడ్రసు
చాలా సులువుగానే దొరికింది. పెద్ద
షాపేమీ కాదు, చిన్న
అరుగుమీద ఒకే ఒక్క
మిషను. ఒక చిన్న
కుర్రాడు, సుమారు పది
సంవత్సరాలుంటాయి
చొక్కాలకి బొత్తాలు కాజాలు
కుడుతున్నాడు.
"బాబూ!
ఖాదిర్ షాపిదేనా" అడిగాడు దివాకరం ఆ
కుర్రాడిని.
" లేడండి నమాజుకెళ్ళాడు ఒక
అర గంటలో వస్తాడు" అని ఆ
కుర్రాడు చెప్పి కూర్చోవడానికి స్టూలు
చూపించాడు . దివాకరానికి అనుమానం వచ్చింది అసలు
సరిగ్గా కుడతాడాని. కానీ
ఆ ఎండలో మరి
ఇంక తిరగడానికి సాహసించకుండా స్టూలుమీద కూర్చున్నాడు. ఆకుర్రాడినే చూస్తున్నాడు. హుషారుగా ఒక
చొక్కా తరువాత మరొక
చొక్కాకి కుట్టుకుంటూ పోతున్నాడు. చాలా
చురుగ్గా ఒక యంత్రంలో పనిచేస్తున్నాడు.
" బాబూ నువ్వేమవౌతావు ఖాదిర్
కి" అడిగాడు దివాకరం.
"ఖాదిర్
మానాన్నండి. నా పేరు
షాజహాన్" అని బదులిచ్చాడాకుర్రాడు.
" ఏం చదువుతున్నావు షాజహాన్" అని అడిగాడు దివాకరం.
" స్కూలు మానేశానండి. అయిదు
దాక చదివాను" అన్న షాజహాను మాటల్లో కొంత
బాధలాంటిది ధ్వనించింది.
దివాకరం ఆసక్తిగా మాటలు
కొనసాగించాడు. తనకిద్దరక్కలున్నారని , సుమారు
౩ మైళ్ళ దూరంలో
కాలనీలో వాళ్ళిల్లుందని, వాళ్ళమ్మ ఇంటిదగ్గరే ఉన్న
ఒక అపార్టుమెంటు వద్ద
ఇస్త్రీ బండి నడుపుతుందని గడ
గడా అచ్చ తెలుగులో చెప్పాడు. వాడి
భాష చూసి ముచ్చటేసింది దివాకరానికి. టివి
ఏంకర్ల తెలుగుతో అసలు
తెలుగు మరచిపోతున్న ఈరోజుల్లో చక్కటి
స్వరంతో గోదావరి యాసతో
ఒక ముస్లీం అబ్బాయి ఒక్క
అక్షరంకూడా పొల్లుబోకుండా చెప్పడంచూసి ఆశ్చర్యమేసింది.
ఇంతలో తెల్ల
కుర్తా పైజమా, తెల్లని గడ్డం
నెత్తిమీద టోపీ ఉన్న
ఒక వ్యక్తి వచ్చి
"నమస్తే సార్" అన్నాడు.
అతనే ఖాదిర్
అని అర్ధమైంది దివాకరానికి.
"ఇవి
ఆరు జతలు, పది
రోజులలో కుట్టివ్వాలి. కుదురుతుందా" అడిగాడు దివాకరం.
"అలాగే
సార్" అని తలూపి
టేపుతో కొలతలు తీసుకోవడం మొదలెట్టాడు ఖాదిర్.
తండ్రి టేపుతో కొలతలు
తీసుకొని చెపుతుంటే షాజహాను పుస్తకంలో రాస్తున్నాడు. ముత్యాల్లాంటి అక్షరాలు. ఏమాత్రం ఒంకరలులేవు. తనచేతివ్రాతని గుర్తుకుతెచ్చుకొని కొంచెం
సిగ్గుపడ్డాడు
దివాకరం.
"ఎన్నిరోజులలో కుట్టివ్వగలవో ఖచ్చితంగా చెప్పు"
అన్నాడు దివాకరం.
"వచ్చేవారం మొత్తం
అన్నీ కుట్టి ఇస్తాను సార్
కొంచెం అడ్వాన్సు ఇవ్వండి" అడిగాడు ఖాదిర్.
"ఇస్తాను, ముందు
మొత్తం ఎంతవుతుందో చెప్పు"
అన్నాడు దివాకరం.
"జతకారొందలుజొప్పునివ్వండి" అన్న ఖాదిర్
మాటలకెదురు చెప్పకుండా ఒక
500 రూపాయిలు అతని చేతిలో
పెట్టి ఇంకొక 200 రూపాయిలు తీసి
షాజహానుకి ఇవ్వబోయాడు దివాకరం.
కాని వాడు
తీసుకోవడానికి
నిరాకరిస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. తీసుకొమ్మని కొంచం
గట్టిగా చెప్పినాసరే వినలేదు. ఆ
డబ్బు కూడా ఖాదిరికిచ్చి బట్టలకొట్టుదగ్గరకు నడిచాడు దివాకరం.
ఇంకా చీరలు
చూస్తూనే ఉంది నీలిమ.
" అప్పుడే వచ్చేశావా! ఇంకా
నా సెలక్షన్ అవ్వనేలేదు" అంది దివాకరాన్ని చూసి.
అయితే నేను
వెళ్ళి ఆ సోఫాలో
రిలాక్స్ అవుతానని దివాకరం అక్కడున్న సోఫాలో
కూలబడ్డాడు.కళ్ళు మూసుకొని షాజహాన్ గురించే ఆలోచిస్తున్నాడు దివాకరం.చాలా
చురుకైన కుర్రాడు, ఇలా
బాల కార్మికుడుగా జీవితాన్ని వృధాచేస్తున్నాడనిపించింది. తానేమీ
సాయం చేయలేడా? వాడి
జీవితాన్ని మార్చలేడా అని
తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఎలాగైనా సరే
వాడి జీవితాన్ని మార్చాలనే ధృఢాభిప్రాయానికి వచ్చాడు.
"కమాన్
దివా! అయాం డన్"
అన్న నీలిమ పిలుపుతో
దివాకరం ఒక్కసారి కళ్ళు
తెరచి, సెల్ ఫోనులో
టైం చూస్తూ, అబ్బా
అప్పుడే ఆరైందా అని,
ఆమెతో కలసి బయటకు
నడిచాడు.
అటువైపుగా వస్తున్న ఆటోలో
ఎక్కి ఇంటికి బయలుదేరారు.
"బట్టలు
ఎప్పుడిస్తానన్నాడు
దివా?" అడిగింది నీలిమ
.
"వారం
లోపలే ఇస్తాడుట" అన్నాడు.
"అబ్బా!
అంత తొందరగానా?" అని కొంత
ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
" నీలూ! ఈరోజు
ఒక పిటీఫుల్ బోయ్
ని చూశాను" అన్నాడు దివాకరం.
" పిటీఫుల్? ఎక్కడ?"
అంది ఆమె.
" చెబుతా విను"
అంటూ షాజహాను చురుకుదనాన్ని వాడి
ప్రవర్తనను నీలిమకి ఒక
కధలా వివరించాడు.
అదివిని ఎంతో
ఎక్సైట్ అవుతుంది అనుకున్న దివాకరానికి, "ఓహో! అది
మామూలే దివా వాళ్ళ
జీవితాల్లో" అన్న ఆమె
సమాధానం, అతన్ని పూర్తిగా నిరాశ
పరచింది".
ఇంకా బయిట
ఎండ ఉక్కపోత. ఇంటికిచేరి స్నానం
చేసేసరికి ఒక్కసారి హాయిగా
అనిపించి ప్రాణం లేచొచ్చినట్లయింది ఆ
దంపతులకి.
భోజనం చేస్తున్నసేపు దివాకరం ఆలోచనలన్నీ షాజహను
చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా నీలూని
కన్వీన్స్ చేసి షాజహాన్ కి
ఒక మంచి దారి
చూపించాలి అని ఒక
ధృడ నిశ్చయానికొచ్చి పడగ్గదిలో మంచంపై
నడుమువాలుస్తుండగా
నీలిమ వచ్చింది.
"నీలూ!
మనం షాజహాన్ ని
చదివిస్తే ఎలావుంటుంది" అడిగాడు దివాకరం.
"దివా!
వాడేమీ చదవడు. నువ్వు
అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. పోనీ
వాడికి కొంత డబ్బు
ఇవ్వు" అని నీలిమ
చాలా తేలిగ్గా కొట్టి
పారేసింది. ఆమె మాటలు
దివాకరానికి చివుక్కుమనిపించాయి.
"నీలూ!
వాడికి అహంభావం ఎక్కువ,
నేను ఇచ్చిన డబ్బు
తీసుకోలేదు తెలుసా? అందరినీ ఒక
కాడికి కట్టకూడదు" నిష్టూరంగా అన్నాడు.
భర్తకి కోపం
వచ్చిందని అర్ధమైంది నీలిమకి.
"నీ
ఇష్టం దివా! నీకంతగా ఏదైనా
చెయ్యాలనిపిస్తే
నేనేమీ అడ్డు చెప్పను. ప్లీజ్
ప్రొసీడ్" అని అతని
భుజంపై చేయివేసి కళ్ళల్లోకి చూస్తూ
చెప్పింది.
ఆ మాటలకి
ఎక్కడలేని ఊత్సాహం వచ్చింది దివాకరానికి.ఇక
ఇండియాలో ఉండేది రెండు
వారాలే కాబట్టి ఇక
సమయం లేదని ఆమర్నాడే వాడి
చదువు సంగతి చూడాలని నిశ్చయించుకున్నాడు.
ప్రొద్దూన్నే లేచి
రెడీఅయ్యి ఆటోలో ఖాదిర్
కొట్టుకి బయలుదేరాడు. ఇంతలో
మరో ఆలోచన వచ్చింది దివాకరానికి. అసలు
వాడు చదువుకున్న స్కూలుకెళ్ళి ఎలా
చదివేవాడో ఎంక్వైరీ చేస్తే
ఎలా ఉంటుందని. ఆ
ఆలోచన సబబే అనిపించింది. ఒకవేళ
చదువులో ఏమాత్ర శ్రద్ధ
చూపించకుండా, స్కూలు ఎగ్గొట్టుంటే మాత్రం,
ఇప్పుడు తనప్రయత్నం వృధాయే
అనుకొని, ఆటోని స్కూలు
వైపు పోనీమన్నాడు.
హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళి
తనను తాను పరిచయం
చేసుకొని, షాజహాను గురించి అడగడం
మొదలు పెట్టాడు. స్కూల్
మానేసి ఎన్నో రోజులు
కాకపోవడంతో చాలా సులభంగానే హెడ్మాస్టర్ షాజహానుని గుర్తుకు తెచ్చుకున్నారు. చాలా
చురుకైన తెలివైన కుర్రాడని చదువుల్లోనే కాకుండా ఆటల్లో
కూడా అందరికంటే ముందుండేవాడని తెలపడంతో దివాకరానికి మంచి
ఊరట లభించి ఉత్సాహంతో ఖాదిర్
కొట్టుకి చేరాడు.
నిన్ననేకదా ఇచ్చి
వెళ్ళారు! అప్పుడేవచ్చారేమిటీ అన్న
సందేహంతో "నమస్తే సార్"
అంటూ కత్తెర తో
బట్టలు కత్తిరిస్తున్న ఖాదిర్
బయటికి వచ్చి దివాకరాన్ని అక్కడున్న స్టూల్
పై కూర్చోమన్నాడు.
దివాకరం ఇంక
వేరేదేమీ మాట్లాడకుండా
"ఖాదిర్!
నీకొక సలహా చెబుతాను, వింటావా" అంటూ అసలు
విషయం మొదలుబెట్టాడు.
"చెప్పండి సార్"
అన్నాడు ఖాదిర్ నెత్తిమీద టోపీ
సర్దుకుంటూ.
"షాజహాన్ ని
స్కూల్ కి పంపించి చదివించు" అన్నాడు.
ఇంకా ఏదో
పెద్ద విషయం అనుకున్న ఖాదిర్
కి ఆమాట వినగానే ఒక
చిన్న నవ్వు నవ్వి,
"లేదు సార్! వాడిక్కడ లేకపోతే నాకు
కష్టమవుతుంది. అందుకే బడి
మానిపించా" అని తిరిగి
బట్టలని కత్తిరించడం మొదలుబెట్టాడు.
ఖాదిర్ మాటలకు
కొంత నొచ్చుకున్న దివాకరం, ఎలాగైనా తన
పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలతో, షాజహాన్ని తాను
చదివిస్తానని, చదువుకుంటే పిల్లలజీవితాలు మారడమే
గాకుండా తల్లితండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో ఎలా
ఆదరింపబడతాయో కొంచెం నచ్చచెప్పే ధోరణిలో ఉదాహరణలతో సహా
చెప్పేసరికి ఖాదిర్ కొంచం
మెత్తబడి ఆలోచించడం మెదలుబెట్టాడు.
ఇదంతా వింటూనే ఏకాగ్రతగా తనపనితాను చేసుకుపోతున్న షాజహాన్ని బయటకు
పిలిచి
" షాజహాన్! నువ్వు
మళ్ళీ స్కూల్ కెళ్ళి
చదువుకుంటావా?" అడిగాడు దివాకరం.
ఒక్కసారి కళ్లళ్ళో మెరుపులు మెరిసినా, తండ్రివైపు చూసి
తలదించుకున్నాడు
షాజహాన్.
గతంలో తను
స్కూలుకి వెళతానని మారాం
చేయడం, తండ్రి వద్దనిచెప్పడం ఒకసారి
కొట్టునుంచి పనిమానేసి స్కూలుకి పోతే,
తండ్రి వచ్చి తనని
కొట్టుకుంటూ తీసుకొచ్చి పనిచేయించడం ఆ
చిన్న మెదడు మరచిపోలేదు. అప్పటి
నుంచి స్కూలు సంగతి
మరచిపోయాడు షాజహాను. అవన్నీ
గుర్తుకొచ్చి ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు
తిరిగాయి. బెరుగ్గా తండ్రి
కేసి చూసాడు.
వాడికి స్కూల్
కి వెళ్ళడం ఇష్టమేనని గ్రహించాడు దివాకరం. ఖాదిర్
దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
"ఏమాలోచించావ్ ఖాదిర్"
అన్న దివాకరం మాటలకి
ఒక్కసారి లోకంలోకి వచ్చి
" సార్! కొంచెం
టైం ఇవ్వండి మాఅవిడతో మాట్లాడి చెబుతాను" అన్నాడు.
" నీకు అభ్యంతరం లేకపోతే నేను
కూడా వస్తాను ఇప్పుడే వెళ్ళి
మాట్లాడదాం" అన్నాడు దివాకరం.
ఖాదిర్ ఇంక
ఎదురు చెప్పకుండా, షాజహాన్ కి
కొట్టు అప్పగించి, దివాకరంతో కలసి
ప్రక్క వీధిలోనున్న అపార్టుమెంటు కాంప్లక్సు దగ్గరకెళ్ళారు. అక్కడ
ఖాదిర్ భార్య చిన్నబండి పెట్టుకుని బట్టలు
ఇస్త్రీ చేస్తోంది. ఇద్దరి
కూతుళ్ళు కాడా అక్కడే
ఉన్నారు. వాళ్ళలో పేదరికపు ఛాయలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆమెకి దివాకరాన్ని పరిచయం
చేసి విషయమంతా చెప్పాడు ఖాదిర్.
ఆమెకి ఆనందం కలిగినా ఒక్కసారి నిట్టూర్చింది.
"అయ్యా
మాఇంట్లో అందరూ పనిచేస్తేనే గానీ
గడవదయ్యా! వాడు స్కూలికెళితే ఖాదిర్
ఒక్కడూ చేసుకోలేడు. ఇబ్బందవుతుంది"దండంపెడుతూ చెప్పిందామె. ఒక్కసారి నీరుకారిపోయాడు దివాకరం. కానీ
ఎలాగైనా ఒదలకూడదనుకున్నాడు.
"ఇదిగో
చూడండి! షాజహాను బ్రతుకును మీరు
దయచేసి నాశనం చేయకండి. వాడు
చదువుకుంటే భవిష్యత్తులో మీకీ
కష్టాలుండవు" అని కొంచెం
కఠినంగానే చెప్పాడు దివాకరం.
భార్య ముఖంలోకే చూస్తున్నాడు ఖాదిర్.
ఇక లాభం
లేదనుకొని ఆఖరి అస్త్రంగా
" చూడు ఖాదిర్!
నీకు పనిలో సాయం
చేయడానికి ఎవరినైనా పెట్టుకో. ఆజీతం,
షాజహాను స్కూలు ఫీజులు,
తిండి, బట్టలు ఇతరఖర్చులు కలిపి
మొత్తం పది వేలు
నెలనెలా ఇస్తాను. నేను
షాపు దగ్గర వెయిట్
చేస్తూ ఉంటాను, మీరు
ఆలోచించుకొని నాకు ఏవిషయం
చెప్పండి" అని దివాకరం వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు.
ఒక్కసారి మొగుడు
పెళ్ళాలు గతుక్కుమన్నారు. నెలయ్యేసరికి అతికష్టం మీద
అయిదారువేలు సంపాదించేవాళ్ళకి ఇంత
పెద్దమొత్తం వినేసరికి కాదనడానికి ఇక
ఏకారణం కనపడలేదు.
ఆరోజే షాజహాన్ని స్కూలుకి తీసుకెళ్ళి జాయిన్
చేయడం, కావలసినవన్ని కొనివ్వడం జరిగిపోయాయి.
ఒక మంచిపనిచేశాననే తృప్తితో దివాకరం మనసు
దూదిపింజలా గాల్లో ఎగరసాగింది. చాలా
ఆనందంతో ఇల్లు చేరుకున్నాడు.
"నీలూ!
ఎక్కడున్నావ్?" అని పిలిచేలోగా, ఆటో
శబ్దం వినబడి తనే
పెరట్లోంచి ఇంట్లోకి వచ్చింది.
దివాకరం మొహం
వెలిగిపోవడం చూసి అన్నీ
అతను అనుకున్నట్టే జరిగి
ఉంటాయని ఊహించుకుంది. దివాకరానిది చిన్న
పిల్లాడి మనస్తత్వం. సంతోషమైనా విచారమైనా మొహం
మీదే తెలిసిపోతుంది. జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించాడు నీలిమకి.
బాగా అలసిపోయాడేమో! భొజనం
చేసి మంచం మీద
చేరిన వెంటనే నిద్ర
కమ్ముకొచ్చింది
దివాకరానికి.
తను దేశం
వదలివెళ్ళే ముందురోజు ఖాదిర్
చేతిలో పది వేలు
పెట్టి నెలనెలా బాంకులో డబ్బు
జమచెస్తానని హామీ ఇచ్చి,
షాజహాన్ని బాగా చదువుకోవాలని హితబోధ
చేసి భార్యతో కలసి
ఫ్లయిట్ ఎక్కి వచ్చేసాడు దివాకరం.
ఉరుకుపరుగుల యాంత్రిక జీవితంలో వారాలు
నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. వారాంతరాలు ఇంట్లో,
బజార్లో పనులతో సరిపోతున్నాయి. ఠంచనుగా నెల
నెలా ఖాదిర్ కి
డబ్బు పంపిస్తున్నాడు దివాకరం.
వీలు కుదిరినప్పుడల్లా ఫోనులో
మాట్లాడుతున్నాడు.
షాజహాను క్రమం తప్పకుండా స్కూల్
కి వెళుతున్నాడని, బాగా
చదువుతున్నాడని
విని చాలా సంతోషించేవాడు. నీలిమతో కూడా
ఆవిషయం పంచుకొని ఇద్దరూ
ఆనందించేవారు.
గిర్రున ఏడాది
తిరిగిపోయింది.
ఒక్కసారి ఇండియా వెళ్ళొద్దాం రెండు
వారాలకి అని అనుకుంటున్న దివాకరానికి, పిల్లలు భార్యా
యూరప్ ట్రిప్ వెళదాం
అనేసరికి కాదనలేకపోయాడు. సెలవంతా అయిపోవడంతో ఇక
ఇండియా ప్రయత్నాన్ని ఆ
సంవత్సరం విరమించాడు. తన
స్నేహితులెవరైనా
ఇండియా వెళుతుంటే వాళ్ళతో షాజహాను కోసంబట్టలు బూట్లు
చాక్లేట్లు వంటివి పంపేవాడు. అప్పుడప్పుడు ఖాదిర్
తో ఫోనులో మాట్లాడడం, నెల
నెలా క్రమం తప్పకుండా డబ్బుపంపడం కొనసాగిస్తూనే ఉన్నాడు.
మరదలి పెళ్ళి
ముహూర్తం పెట్టామని మామ
గారు ఫోను చేయటంతో, ఆర్నెల్లు ముందుగానే భార్యా
పిల్లలతో ఇండియా వెళ్ళడానికి టిక్కట్ట్లు బుక్
చేయించాడు. చాలా ఆనందంగాఉంది దివాకరానికి, ఈవంకనైనా షాజహాన్ని కలవచ్చని. అప్పటికి రెండు
సంవత్సరాలవుతుంది
స్కూల్లో చేర్చి. ఫోను
చేసినప్పుడల్లా
ఖాదిర్ చెబుతున్నాడు, బాగా
చదువుతున్నాడని,
స్కూల్లో అందరికంటే ముందుంటున్నాడని. ఆమాటలువిని దివాకరం పొంగిపోతున్నాడు. పెద్ద
క్లాసుల్లోకి వెళుతున్నాడు కాబట్టి ట్యూషను పెట్టిస్తే బాగుంటుందని తన
మిత్రులద్వారా
వాకబు చేసి, ఒక
పేరున్న ట్యూషను సెంటర్
ని ఎంపికచేసి వాళ్ళతో ఫోనులో
మాట్లాడి, అడ్వాన్సు చెల్లించి సీటు
రిజర్వ్ చేయించాడు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ
మంచి కాలేజి లో
జాయిన్ చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
ఇండియా చేరిన
మరునాడే షాజహను కోసం
పట్టుకొచ్చిన గిఫ్టులు బట్టలు
పట్టుకొని ఆటోలో బయలుదేరాడు దివాకరం.
"జూన్
నెలైనా ఎండ విపరీతంగా ఉందేంటయ్యాబాబు" ఆటోడ్రైవర్ తో
మాట కలిపాడు.
"ఈరోజుల్లో ఆనెలా
ఈనెలా అని లేదుసార్ ఏడాదికి పది
నెల్లు ఎండే" అని నిట్టూర్చాడు ఆటోడ్రైవర్.
గాలి వీస్తుండటంతో ఉక్కపోత లేదు.
తిన్నగా ఖాదిర్ కొట్టుకి తీసుకుపొమ్మన్నాడు ఆటోని.
వెళ్ళేసరికి తాళం వేసిఉంది. ఖాదిర్
ఫోనుకి ప్రయత్నిస్తే అందుబాటులో లేదని
వస్తోంది. భోజనానికో లేదా
నమాజుకో వెళ్ళి ఉంటాడనుకొని తిరిగి
ఆటోలో షాజహాను స్కూలికి బయలుదేరాడు. ఆరోజు
రెండో శనివారం శెలవట,
స్కూలు మూసేసి ఉంది.
ఇల్లెక్కడో తెలియదు, షాజహాను తల్లి
ఇస్త్రీ చేసే అపార్ట్మెంటు గుర్తుకొచ్చింది. కానీ
పేరు గుర్తు లేదు,
లీలగా దారి గుర్తుంది. తను
గుర్తులు చెబుతుంటే ఆటో
వెళుతోంది, మొత్తానికి అక్కడికి చేరుకున్నారు. బండుంది గానీ,
ఎవరో ఒకతను తలపాగా
కట్టుకొని ఇస్త్రీ చేసుకుంటున్నాడు. వివరాలడిగితే తనొచ్చి ఆర్నెల్లవుతోందని ఎవరూ
తెలియదన్నాడు. ఏం చేయాలో
పాలుపోలేదు దివాకరానికి. తిరిగి
ఆటోని కోటగుమ్మంవద్దకు పోనీమ్మని, అక్కడ
దిగి డబ్బులిచ్చి పంపించేశాడు. తల
బద్దలుకొట్టేస్తోంది
అర్జంటుగా స్టాంగ్ కాఫీ
తాగుదామని ప్రక్కనే కనిపిస్తున్న హొటల్
వైపు దారితీసాడు. కాఫీ
త్రాగుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈపాటికి ఖాదిర్
వచ్చి ఉంటాడేమో ఒక్కసారి మళ్ళీ
ఖాదిర్ కొట్టువద్దకెళదాం అని
నిర్ణయించుకొని,
చేతిలో సామాను బరువుగా ఉండటంతో ఆటొ
ఎదైనా వస్తుందేమోననని కాసేపు
ఎదురుచూసి ఇక లాభం
లేదనుకొని నడక ప్రారంభించాడు. మెల్లిగా ఖాదిర్
కొట్టుకి చేరాడు. ఇంకా
తాళం అలాగేఉంది. చుట్టూ
ఎవరి పనులలో వాళ్ళు
బిజీగా ఉన్నారు. ఒక
ప్రక్కన బిల్డంగ్ నీడలో
నిలబడ్డాడు. ఖాదిర్ ఫోనుకి
ప్రయత్నిస్తూనే
ఉన్నాడు. ప్రతిసారి అదే
సమాధానం. విసుగ్గా ఫోను
జేబులో పెట్టుకుని ఇక
ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని సిద్ధమౌతుండగా, ఖాదిర్
కొట్టు ముందు సైకిల్
పై ఒక వ్యక్తి దిగి,
కొట్టు తాళం తీస్తున్నాడు. దివాకరం గబగబా
నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. తాళంతీసి ఆవ్యక్తి లోపలనుంచి కొన్ని
గోనె సంచులు తీసుకొని బైటకొచ్చాడు. లోపల
కుట్టు మిషన్ ఏమీ
కనిపించలేదు దివాకరానికి. బయటికొచ్చిన వ్యక్తి ఏం
కావాలన్నట్లుగాచూస్తుంటే,
ఖాదిర్ గురించి అడిగాడు దివాకరం.
"ఖాదిర్
కి మీరేమవుతారు" అన్న అతని
ప్రశ్నకి దివాకరం సమాధానం చెప్పగానే ఆ
వ్యక్తి ఒక్కసారి గతుక్కుమని లోపలకి
తీసుకువెళ్ళి లోపలకి తీసుకువెళ్ళి దివాకరాన్ని స్టూలుపై కూర్చోమని తను
క్రింద కూర్చుంటూ “మీరు
ఖాదిర్ తో ఆఖరు
సారి ఎప్పుడు మాట్లాడారు సార్"
అనడిగాడు.
సుమారు ఆరు
నెలలై ఉంటుందని, తరువాత
రెండుమూడు సార్లు ప్రయత్నించినా ఫోను
కలవలేదని చెప్పాడు దివాకరం.
సమాధానం విన్న
ఆవ్యక్తి కాసేపు మౌనంగా
ఉండిపోయాడు.
“ఉండండి
సార్ టీ పట్టుకొస్తాను" అంటూ , దివాకరం వద్దని
వారిస్తున్నా వినకుండా బయటికివెళ్ళి పది
నిమిషాల్లో రెండు కప్పులతో టీ
తీసుకొచ్చి, ఒకటి దివాకరానికిచ్చి రెండోది తను
తీసుకొని చెప్పడం ప్రారంభించాడు. ఆవ్యక్తి చెప్పే
సమాచారం వింటుంటే కళ్ళు
బైర్లుతిరుగుతున్నాయి
దివాకరానికి. చెప్పిందంతా విన్నాకా ఒక్కసారి కాళ్ళకింద భూమి
చీలిపోయి తాను అందులో
కూరుకుపొయినట్లనిపించింది.
కళ్ళుమూసుకొని
నీరసంగా గోడకి జారగిలపడ్డాడు.
నోటమాట రావడంలేదు. కాసేపటికి స్థిమితపడి, ఆవ్యక్తిని ఆటో
తీసుకురమ్మని చెప్పి, అందులో
కూలబడి ఇంటికి తిరిగి
పయనమయ్యాడు దివాకరం.
ఇల్లంతా పెళ్ళికొచ్చిన చుట్టాలతో హడావిడిగా ఉంది.
దివాకరాన్ని చూసిన నీలిమ
ఆశ్చర్యపోయింది.మొహమంతా నల్లగా
మాడిపోయి పది లంఖణాలు చేసినివాడిలా ఉన్నాడు. ఉదయం
షాజహానుకోసం పట్టుకొని వెళ్ళినవన్నీ తిరిగి
తీసుకొనిరావడంతో
ఒకింత ఆదుర్దా పడి,
గదిలొకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఫ్రిజ్
లోంచి చల్లని మంచినీళ్ళు పట్టుకొచ్చి ప్రక్కన కూర్చుని అతనికిస్తూ
"దివా!
ఆర్ యూ ఓకే?"
అని ఆమె అడగ్గానే, ఒక్కసారి దుఃఖం
పొంగి పొర్లింది దివాకరానికి. ఆమె
రెండు చేతులు పట్టుకొని వెక్కి
వెక్కి ఏడవసాగాడు.
ఒక్క నిమిషం
తరువాత స్థిమితపడి "ఆ వ్యక్తి" ఇచ్చిన సమాచారాన్ని నీలిమకు చెప్పడం ప్రారంభించాడు.
"ఖాదిర్
కొన్ని రోజులపాటు షాజహాన్ని స్కూలుకి బాగానే
పంపాడు. దివాకరం చెప్పినట్లుగా కొట్లో
ఇంకెవర్నీ పనిలోకి పెట్టుకోలేదు. షాజహాన్ని స్కూల్
అయిపోయిన తరువాత కొట్టుకి తీసుకువచ్చి రాత్రి
దాకా పనిచేయించేవాడు. నెల
నెల ఖచ్చితంగా దివాకరాన్నించి డబ్బు
అందుతూండటంతో అప్పటికే మద్యం
అలవాటున్న ఖాదిర్ దాని
పరిణామాన్ని ఇంకా పెంచి,
త్రాగుడికి పూర్తిగా బానిసయ్యాడు. దానికి
తోడు పేకాట కూడా
జోడవడంతో కొన్ని రోజులపాటు షాపు
తీసేవాడు కాదు. దానితో
బేరాలు బాగా తగ్గిపోయాయి. పగలంతా
పేకాట రాత్రంతా మత్తుతో సంసారాన్ని పట్టించుకోవడం మానేశాడు. అప్పటికే ఫీజులు
కట్టకపోవడంతో అనేక హెచ్చరికల తరువాత
షాజహాన్ని స్కూల్ నుండి
తీసేసారు. దివాకరం ఫోను
చేసినప్పుడల్లా
అబద్ధాలు చెప్పేవాడు.ఇల్లంతా రోజూ
నరకంలా తయారైంది. భార్యసంపాదనతోనే ఒకరోజు
తింటే ఒకరోజు తినేవారుకాదు. పేకాటాడి సాయంత్రానికి తాగి
ఇంటికి రావడం, భార్యా
భర్తలు గొడవపడడం, దొరికింది పుచ్చుకొని భార్యని కొట్టడం చుట్టుప్రక్కలవాళ్ళకి ఇది
రోజూ ఉచిత వినోదంలా ఉండేది.
షాజహాన్ కి తండ్రి
ప్రవర్తన చాలా చికాకు
పుట్టిస్తోంది.
కానీ ఏమీ చేయలేని అసహాయ
స్థితి. ఇద్దరి అక్కలదీ కూడా
అదే స్థితి.
ఒకరోజు రోజూలాగే ఫుల్
గా త్రాగి ఇంటికివచ్చాడు ఖాదిర్
. అప్పటికే అతని ప్రవర్తనతో విసిగి
వేసారిపొయిన భార్య , లోపలకి
రావద్దని గుమ్మనికి అడ్డంగా నుంచుంది. ఇద్దరికీ పెద్ద
పెనుగులాటజరుగుతోంది.
ఒక్కసారి భార్యని నేలమీదకి తోసేసాడు. త్రాగుడు మైకంలో
తనేంచెస్తున్నాడో
తనకే తెలియడం లేదు.
పూర్తిగా విచక్షణ కోల్పొయాడు. ప్రక్కనే ఉన్న
పచ్చడి బండని తీసుకొని భార్య
తలపై గట్టిగా మోదాడు.
ఇదంతా నిశ్చేష్టపోయి చూస్తున్న షాజహాన్ కి
విపరీతమైన కోపం ఉద్రేకం కలిగాయి. ఒక్కసారి తండ్రిమీదకి ఉరికాడు. క్రిందపడేసి అదే
పచ్చడి బండని తీసుకొని తండ్రి
తలపై కసిగా మోదుతూనేఉన్నాడు. అతన్ని
ఆపడానికి అక్కలిద్దరు చేసిన
ప్రయత్నం ఆ మొండిబలం ముందు
వెలవెల బోయింది. అప్పటికే ఆ
భార్యా భర్తలిద్దరి ప్రాణాలు గాల్లో
కలసి పోయాయి. ప్రస్తుతం షాజహాను చిన్నపిల్లల జైలులో
ఉన్నాడు. అతని అక్కలిద్దరూ ఎమైపోయారో ఎవరికీ
తెలియదు."
చెప్పడం పూర్తిచేసిన దివాకరం, నీలిమ
కళ్ళలోకి చూస్తూ " నేను తప్పుచేశానంటావా" అని బేలగా
అడుగుతుంటే, ఆమె దుఃఖం
ఆపుకోలేకపొయింది.
గోపాలం మాస్టారు ఉ దయం 6 గంటలకు ఒక ఎత్తఱుగుల ఇంటి దగ్గర సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు. ఒక మూడో తరగతి అబ్బాయి మూడో ఎక్కం అప్పజపుతుంటే ...
-
వాగర్ధావివ సంపృక్తౌ - యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్ సదరన్ పేపర్ మిల్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ ప్రారంభమవడానికి ఇంక 10 నిమిషాలు మాత్రమే ఉంద...
-
వెండికంచం - శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ " ఇదిగొ మిమ్మలనే ! ఎక్కడున్నారు ? అమ్మాయి ఉత్తరం రాసింది, పిల్లలకి శెలవులిచ్...

